19+251/2=26
టెన్త్ మూల్యాంకనలో ఇదీ మార్కుల కూడిక..
10/10 గ్రేడు కోల్పోయిన విద్యార్థిని
రీవాల్యుయేషన్లో బయటపడ్డ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
కంభం: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో మార్కుల కూడిక తప్పుతో ఒక విద్యార్థిని తీవ్రంగా నష్టపోయింది. 20 మార్కులు తక్కువ వేయడంతో ఆమె గ్రేడ్ తగ్గిపోవడమేగాక ట్రిపుల్ఐటీలో అవకాశం కూడా కోల్పోయింది. మళ్లీ పరిశీలించినా అధికారులు ఆ తప్పును పట్టుకోలేకపోయారు. ప్రకాశం జిల్లా కంభంకు చెందిన షేక్ అబ్దుల్గఫూర్ కుమార్తె షేక్ రేష్మాభాను స్థానిక వాసవీ విద్యానికేతన్లో 2015-16 సంవత్సరంలో చదివి 1616143584 నంబరుతో పరీక్షలు రాసింది. ఫలితాల్లో 9.5 గ్రేడు సాధించింది.
అన్ని సబ్జెక్టుల్లో 10కి 10 గ్రేడు రాగా ఇంగ్లిష్లో 7 జీపీఏ మాత్రమే వచ్చింది. దీంతో బాలిక తండ్రి రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేశారు. విద్యార్థిని జవాబు పత్రాలు పరిశీలించిన ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ‘నో చేంజ్‘ అని పంపించారు. బోర్డు వారు పంపించిన నకలు సమాధాన పత్రాలను పరిశీలిస్తే కూడిక తప్పు వల్ల విద్యార్థిని 20 మార్కులు కోల్పోయినట్టు స్పష్టమైంది. ఇంగ్లిష్ పార్టు-బి (బిట్పేపర్)లో 14, 15 నంబరు ప్రశ్నలకు సమాధానాలు అన్ని కరెక్టుగా రాసినప్పటికీ 5 మార్కులు వేయాల్సి ఉండగా 4 వేశారు.
ఇంగ్లిష్ పేపర్ పార్టు-ఎ లో19 మార్కులు, పార్టు-బిలో 25 1/2 మార్కులు వచ్చాయి. ఈ రెండూ కలిపి 46 మార్కులు రావాల్సి ఉండగా 26 మార్కులు మాత్రమే వేశారు. దీంతో గ్రేడ్ తగ్గిపోయింది. అధికారుల తప్పు వల్ల నష్టపోయిన తనకు న్యాయం చేయాలని రేష్మాభాను విజ్ఞప్తి చేస్తోంది. మార్కుల కూడికలో తప్పు వల్ల తన కుమార్తె ప్రతిభ అవార్డుకు దూరమైందని, ట్రిపుల్ఐటీలో సీటు దక్కలేదని రేష్మాభాను తండ్రి అబ్దుల్గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు.