రూ. కోటితో వంతెన నిర్మాణం.. ఇప్పటికైనా
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా అన్నాడో ఓ కవి. ఆ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించారు అసోంలోని కమ్రప్ జిల్లా వాసులు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా... డబ్బు పోగేసుకుని స్వయంగా వంతెన నిర్మించుకున్నారు. ఐకమత్యంతో కష్టాల కడలిని ఎదురీది అందరికీ ఆదర్శంగా నిలిచారు. భారత్లో వరదల ప్రభావానికి గురవుతున్న రాష్ట్రాల్లో అసోం కూడా ఒకటి. వర్షం పడిందంటే చాలు ఈ ఈశాన్య రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 40 శాతం ప్రాంతం నీట మునుగుతుంది. ఇందులో కమ్రప్ జిల్లా కూడా ఒకటి. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాలను విడదీస్తున్న జల్జలీ నది వర్షాకాలంలో పొంగిపొర్లడంతో రాకపోకలు వీలుకాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (‘కరోనా అన్ని వర్గాలను ఒక్కటిగా నిలిపింది’)
స్కూలుకు వెళ్లాలన్నా.. ఆస్పత్రికి వెళ్లాలనే వారికి నాటు పడవలే గతి. దీంతో తమ సమస్యలను వివరిస్తూ నదిపై వంతెన నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ అధికారులు వీరి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడంతో.. విసిగి పోయి రూ. కోటితో చెక్క వంతెన నిర్మించుకున్నారు. కాగా పది గ్రామాల్లోని 7 వేల మంది ప్రజలు 335 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 2018లో ప్రారంభించిన వంతెన నిర్మాణం పూర్తికావడంతో ఇటీవలే దానిని ప్రారంభించారు. చెక్క వంతెనతో తమ కష్టాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగామని.. కాంక్రీట్ బ్రిడ్జి నిర్మిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.(పైలట్ కోసం సిక్కుల ఔదార్యం)