ఏటీఎంనే ఎత్తేశారు
నగదు కోసం ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మెషిన్నే దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన అసోంలోని కామరూప్ జిల్లాలోని రంగియాలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది. ఏటీఎం మెషిన్లో రూ. 5.38 లక్షల నగదు దొంగలు అపహరించారని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఏటీఎం కేంద్రాన్ని మంగళవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఏటీఎంలోని సీసీ ఫూటేజ్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. ఏటీఎం నుంచి మెషిన్ ఎత్తికెళ్లిన సమయంలో ఏటీఎం కేంద్రం వద్ద భద్రత సిబ్బంది లేరని చెప్పారు.
ఏటీఎం కేంద్రంలో నగదు మెషిన్ను బ్యాంక్ సిబ్బంది సరిగ్గా బిగించ లేదన్నారు. ఈ నేపథ్యంలో నగదు మెషీన్ ఎత్తుకెళ్లేందుకు దొంగలకు మరింత సులువైందని తెలిపారు. కామరూప్ జిల్లాలోని రంగియా రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం కేంద్రంలో బ్యాంక్ అధికారులు సోమవారం రూ. 45 లక్షలు పెట్టారని చెప్పారు. అయితే ఖాతాదారులు ఆ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయడంతో దొంగలు ఏటీఎం మెషిన్ ఎత్తుకు వెళ్ల సమయానికి అందులో రూ.5.38 లక్షలు ఉందని వెల్లడించారు. గత నెలలో రంగియా ప్రాంతంలో ఇలాగే మరో ఏటీఎంను దొంగలు ఎత్తు కెళ్లారు. అందులోని రూ. 25 లక్షల నగదు దొంగిలించి... ఆ ఏటీఎం మెషిన్ను మురికి కాల్వలోపడేశారని పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.