kanaka raju
-
ఇందిరా గాంధీ కాళ్లకు గజ్జెలు కట్టా..
నెమలి పురివిప్పి నాట్యమాడితే అడవి పరవశిస్తుంది.. కానీ, ఆ కళాకారుడు గుస్సాడీ నృత్యం చేస్తే అడవే పాదం కలుపుతుంది.. ఆయన గాగ్ర కాళ్లగజ్జెలు కట్టి ఆడితే చెట్టూ, పుట్టా, కొండ, కోన ప్రతిధ్వనిస్తుంది.. ఆయన నృత్యప్రకంపనలు క్రమేణా అడవిని దాటి దేశ రాజధానిని తాకాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా గాగ్ర గజ్జెలతో గుస్సాడీలో కాలు కదిపారు. ఆయన కళాప్రదర్శనకు 2002లో అప్పటి రాష్ట్రపతి కలాం కూడా సలాం చేశారు. కళలోనే కళాకారుల జీవితం నిమగ్నమై ఉంటుందని నిరూపించిన కనకరాజుకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ వరించింది. ఈ పురస్కారం పొందిన మొదటి తెలంగాణ ఆదివాసీ కళాకారుడిగా గుస్సాడీ కనకరాజు నిలిచారు. ఈ సందర్భంగా ఎనభై ఏళ్లు దాటిన పద్మశ్రీ కనకరాజు ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆయన ఆలోచనలు, అనుభవాలు తన మాటల్లోనే... -సాక్షి, హైదరాబాద్ దండారి నృత్యమే స్ఫూర్తి... ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి మా సొంత ఊరు. మేం అడవితల్లి బిడ్డలం. నా చిన్నతనంలో దండారి నృత్యం చూసి స్ఫూర్తిపొందాను. నాకంటూ ఏ గురువూ లేడు. నేను చేసే గుస్సాడీ నృత్యం దండారిలోంచి వచ్చిందే. కళలో లీనమైన నన్ను చాలామంది గుస్సాడీగానే పిలిచేవారు. వారసత్వసంపద నుంచి నేర్చుకున్న కళ నాకు సంతృప్తినే కాకుండా మా ఆదివాసీలందరికీ గుర్తింపునిచ్చింది. కలాం ముందు ప్రదర్శనలు ఇచ్చా.. పద్మశ్రీ లాంటి అవార్డు తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉండే ఆదివాసీ కళాకారులకు వస్తుందని నేను ఊహించలేదు. 1955 నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. 1982లో దేశ రాజధానిలో నిర్వహించిన పరేడ్‌లో అప్పటి ప్రధాని ఇందిర కాళ్లకు మా సంప్రదాయ గాగ్ర గజ్జెలు కట్టాను. ఆమె కూడా మాతోపాటు పాదం కలిపారు. 2002లో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ముందు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించాను. ఇప్పటివరకు దాదాపు 300 మంది కళాకారులకు గుస్సాడీ నృత్యాన్ని నేర్పాను. ఈ తరం వారికి నేర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడితే సహకారమందించడానికి నేను సిద్ధం. (చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ) వ్యవసాయమే బతుకుదెరువు.. మాది గోండు సూర్యవంశం. గుస్సాడీ నృత్యం నా ఊపిరి. కానీ, ఇది మా బతుకుదెరువు కాదు. వ్యవసాయమే ఆధారం. ఎనిమిది మంది కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించాను. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాను. ఇందిరా గాంధీతో కనకరాజు (వృత్తంలో) వైభవోత్సవమైన సంప్రదాయాలు మా సంస్కృతే మా పండుగ. దసరా, దీపావళి మధ్యలో నిర్వహించే భోగిలో గుస్సాడీ నృత్యం ప్రారంభమవుతుంది. గుస్సాడీలో ప్రత్యేక వేషధారణ ఉంటుంది. చేతిలో దండారి, తలపై మల్జాలిన టోíపీ, (మలి అంటే నెమలి, జాలి అంటే ఈకలు అని అర్థం) గాగ్ర కాలిగజ్జెలు, మెడలో నైపాల్క్ హారం, జోరి, గంగారం సోట, జంతువుల చర్మంతో చేసిన వస్త్రాలు, డప్పులు ఉంటాయి. మల్జాలిన టోíపీ పెట్టుకున్న వ్యక్తి ఆదివాసీల దైవం మస్మసూర్‌తో సమానం అని మా ప్రగాఢ నమ్మకం. -
గుస్సాడీ నృత్యం అంటే తెలుసా!
సాక్షి, మంచిర్యాల: ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకం. ఈ నాట్య ప్రదర్శనలో అపార నైపుణ్యం గడించిన కనకరాజు సొంతూరు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం. తమ సంస్కృతిని కొత్త తరానికి అందిస్తున్న గుస్సాడీ రాజు కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో ఆదివాసీ సమాజం హర్షిస్తోంది. ఈ ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కొనసాగుతోంది. ఈ నాట్యానికి మెరుగులు దిద్దడమేగాక నేటి తరానికి శిక్షణ ఇస్తూ.. మరింత గొప్ప కళగా మలిచారు కనకరాజు. ఈ కళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ ఉంది. పౌరాణిక గాథల్లో ప్రస్తావన.. గుస్సాడీ నృత్యం ఆవిర్భావంపై అనేక పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గుస్సాడీ నాట్యం శివుడి ప్రతిరూపం, యత్మసూరు దేవత స్వరూపంగా.. ప్రకృతి ఆరాధనలో ఓ భాగమని ఆదివాసీ పెద్దలు చెబుతారు. తమ పూర్వీకులు అందించిన ఈ నృత్యానికి కాలక్రమేణా ఆదివాసీ ప్రముఖులు మరింత వన్నె తెచ్చారు. వీరిలో ఉట్నూరు ఐటీడీఏ ఏపీవోగా పనిచేసిన ఆదివాసీ ఐఏఎస్ మడవి తుకారాం విశేష కృషి చేశారు. 1940 దశకంలో రాజ్ గోండులపై అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్, ఆ తర్వాత 1978లో ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన శిష్యుడు మైకేల్ యోర్క్ తమ రచనల్లో, డాక్యుమెంటరీల్లో గుస్సాడీ ప్రత్యేకత వివరించారు. దండారీ ఉత్సవంలో... ఆదివాసీ గూడేల్లో దీపావళి పండుగకు వారం ముందు మొదలయ్యే దండారీ ఉత్సవాల్లో గుస్సాడీ ప్రదర్శనలు అమితంగా ఆకర్షిస్తాయి. పురుషులు మాత్రమే గుస్సాడీ వేషధారణ వేస్తారు. గుస్సాడీగా ఉన్న వ్యక్తి నిష్ఠతో దండారీ పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటించాలి. తలపై నెమలి టోపీ (మాల్బూర), చేతిలో దండం (కర్ర), భుజానికి జింక తోలు, ఒళ్లంతా బూడిద, చేతికి పూసలు, రుద్రాక్షలు, కంకణాలు, గుబురు మీసాలు, గడ్డాలతో దీక్ష కొనసాగిస్తారు. వారం, పది రోజులు (దండారీ పూర్తయ్యే వరకు) స్నానం చేయరు. ఒక్కో నెమలి టోపీలో వెయ్యికి పైగా ఈకలు అమర్చుతారు. దీనిని నిపుణులతో చేయిస్తారు. కొందరు ఆడ వేషంలోనూ ఆకట్టుకుంటారు. నృత్యం చేసేప్పుడు సంప్రదాయ వాయిద్యాలైన తుడుం, పిప్రి, కాలికం, డప్పు, గుమెలా, ధోల్, వెట్టి, కర్ర (దండం)తో వాయిస్తూ.. ఎంతో రమణీయంగా పాడుతుంటారు. కష్ట సుఖాలు, సంతోషాన్ని ఆనందాన్ని నాట్యంలో వ్యక్తపరుస్తారు. సాధారణంగా ఈ నృత్యాన్ని దండారీలోనే ప్రదర్శిస్తుంటారు. కళ సాగేంతవరకు తమను తాము మైమరచి దైవత్వం కలిగి ఉంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బృందంగా ఏర్పడి వెళతారు. గుస్సాడీలకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామంలో మెప్పుపొందేలా వారి ప్రదర్శనలు ఉంటాయి. దండారీ ఉత్సవాల కోసం కొన్ని నెలల ముందే ఆదివాసీ గూడేలు సన్నద్ధమవుతాయి. చదవండి: గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి -
భూమి, ఆర్థిక సాయం అందించాలి: గుస్సాడీ రాజు
సాక్షి, కొమురం భీమ్(ఆసిఫాబాద్): గుస్సాడీ కళలో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును వరించడం విశేషం. ఆయన్ని స్థానికులు గుస్సాడీ రాజుగా పిలుస్తారు. చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు వరించిన కనక రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘ పద్మశ్రీ అవార్డు లభించడం సంతోషంగా ఉంది. గుస్సాడీ కళలో తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది అదివాసీలకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. గుస్సాడీ కళను వందల మందికి నేర్పించాను. ప్రముఖులు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చాను. పేద కళాకారున్ని సర్కార్ అదుకోవాలి. సర్కార్ భూమి, అర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను’ అని ఆయన తెలిపారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. -
మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు ఈ ఘనత దక్కింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉంది నాకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉంది. ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన ఇచ్చాను. బహుమతిగా గుస్సాడీ టోపీ కూడా ఇచ్చాను. హన్ను మాస్టారు స్పూర్తితో ముందుకు సాగుతున్నా. – కనక రాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. -
టీబీజీకేఎస్‌ను వీడిన కనకరాజు
సాక్షి, కొత్తగూడెం: టీబీజీకేఎస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ సంఘం మాజీ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు ఆ యూనియన్‌కు గుడ్‌బై చెప్పారు. మరో రెండు వారాల్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్, టీబీజీకేఎస్‌కు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనకరాజుతోపాటు టీబీజీకేఎస్ మణుగూరు బ్రాంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓదెల ఉమామహేశ్వరరావు, బ్రాంచి సెక్రటరీ మేకల ఈశ్వర్, నాయకులు ఓ.రాములు, బి.వెంకటరత్నంలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తాను టీబీజీకేఎస్, టీఆర్ఎస్కు రాజీనామా చేయడానికి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీలో చేరడానికి గల కారణాలను తెలియజేస్తూ కనకరాజు ప్రకటన విడుదల చేశారు. అటు తెలంగాణ ఉద్యమంలోనూ, ఇటు సింగరేణిలో టీబీజీకేఎస్ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశానన్నారు. 2014లో టీబీజీకేఎస్‌లో సంస్థాగత ఎన్నికల్లో తనను ఓడించేందుకు మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ తీవ్ర ప్రయత్నం చేశారని తెలిపారు. అయినప్పటికీ నీతి, నిజాయితీగా ఉన్న తాను విజయం సాధించానని, ప్రస్తుతం టీబీజీకేఎస్ అవినీతిపరుల, ఉద్యమద్రోహుల, పైరవీకారుల యూనియన్‌గా మారిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. కులతత్వంతో టీబీజీకేఎస్ నిండిపోయిందని, నాయకత్వ మార్పు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసి ఓపిక నశించి ఆ పార్టీకి, సంఘానికి రాజీనామా చేసినట్లు వివరించారు కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీలో దళితులు, గిరిజనులు, పీడిత కార్మిక వర్గానికి ప్రాధాన్యత ఉందని, జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరానని తెలిపారు. ఐఎన్టీయూసీ, కాం గ్రెస్ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వ మార్గదర్శకత్వంలో సింగరేణిలో పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపు కోసం కృషి చేస్తానని కనకరాజు పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ తరుపున గోదావరీ పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల్లో కనకరాజు అత్యంత క్రియాశీలకంగా పనిచేశారనే పేరుంది. -
వాసుపల్లిపై రణం
వాసుపల్లి లొల్లి అధికార టీడీపీలో పెను దుమారం రేపుతోంది..దక్షిణ ఎమ్మెల్యేగా, పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై సొంత పార్టీలోని దళితులే తిరుగుబాటు బావుటా ఎగరేసే పరిస్థితికి ఆయన వ్యవహారశైలే కారణమన్నది స్పష్టం.నోటి దురుసు, అనాలోచిత నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యే.. ఈ సారి ఏకంగా దళిత బాణానికే టార్గెట్‌గా మారారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవలసిన దుస్థితిలో పడ్డారు.తమను కులం పేరుతో దూషించారన్న ఆరోపణతో సొంత పార్టీలోని పలువురు దళిత నేతలు నిప్పులు కక్కుతున్నారు. కేసు పెట్టడమే కాకుండా.. పార్టీ నాయకత్వానికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వాసుపల్లికి వ్యతిరేకంగా మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో భారీ సభకూ సిద్ధమవుతున్నారు.ఎన్నికలు ఏడాది దూరంలోనే ఉన్న సమయంలో తలెత్తిన ఈ తిరుగుబాటు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే ఇప్పుడు రాజీ మంత్రం జపిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై ఆ పార్టీ దళిత నేతల తిరుగుబాటు దుమారం రేపుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తిరుగుబాటు చేసిన నేతలను దారికి తెచ్చుకునేందుకు ఒక్కొక్కరికి రెండేసి హుద్‌హుద్ ఇళ్లతో పాటు రూ.30 వేల నగదు ఇస్తామని ఎర వేస్తున్నారు. దారికొచ్చిన వారితో స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అయితే వాసుపల్లి ఆగడాలతో విసిగివేసారిన పార్టీ సీనియర్ నేత రామారెడ్డితో సహా దళిత నేతలు మాత్రం రాజీకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆయన తీరు వల్లే 23వ వార్డు సీనియర్ దళిత నేత సాలిగ్రామం కనకరాజు మనోవేదనతో మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ఫిర్యాదులు పార్టీలో మంత్రి గంటా తర్వాత నగర పార్టీలో ఇన్నాళ్లు చక్రం తిప్పిన వాసుపల్లికి సొంత పార్టీలోనే సెగ మొదలైంది. ప్రత్యేక హోదా ఉద్యమంతో పార్టీ గ్రాఫ్ ఒకవైపు పడిపోతుంటే.. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తలెత్తిన తిరుగుబాటు వాసుపల్లితోపాటు పార్టీకీ తలనొప్పిగా మారింది. 23వ వార్డు అధ్యక్షుడి మార్పు విషయంలో ఎదురు తిరిగిన పార్టీ నేతలను దారికి తెచ్చుకునేందుకు వాసుపల్లి నానాతంటాలు పడుతున్నారు. కులం పేరుతో దూషించారంటూ పార్టీ సీనియర్ నేత, కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్టీ ఓదూరి శివయ్య, అర్బన్ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రేజేటి చిట్టిబాబు, ఎమ్మార్పీఎస్ అర్బన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తరమూడి శ్రీనివాస్‌లు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావు, సీఎం చంద్రబాబుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రచార పోరాటం ఫిర్యాదులతో ఆగకుండా దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వాసుపల్లి అవినీతి, భూకబ్జాలు, దళితులపై దౌర్జన్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. అప్పటికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే పార్టీలోని దళిత నేతలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని భావిస్తున్నారు. బుధవారం నగరానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి మల్లవరపు నాగయ్య మాదిగ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దళితులను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే సాగించిన దాడులు, దౌర్జన్యాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా వచ్చే నెల రెండో తేదీన నగరానికి వస్తున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయనతో నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నట్టు తొత్తరమూడి శ్రీనివాస్ వెల్లడించారు. ఎదురు ఫిర్యాదు వాసుపల్లిపై నమోదైన కేసు విచారణలో భాగంగా త్రీటౌన్ సీఐ ఇమ్మా నియేలురాజు బు«ధవారం టీడీపీ కార్యాలయం, సంఘటన జరిగిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. ఫిర్యాదు చేసిన వారితో పాటు ఆ సమయంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యేతో విబేధించిన పార్టీ సీనియర్ నేత రామారెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తనను కులం పేరుతో దూషించారంటూ ప్రస్తుత వార్డు అధ్యక్షుడు బంగారు రవిశంకర్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరినట్టయ్యింది. ‘కనకరాజు మృతికి ఎమ్మెల్యే వైఖరే కారణం’ ఎమ్మెల్యే వైఖరి కారణంగానే 23వ వార్డు దళిత నేత సాలిగ్రామం కనకరాజు చనిపోయాడని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. చెంగలరావు పేట హైస్కూల్ పక్కనే సీట్ కవర్లు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కనకరాజు బడ్డీని తన ఫ్లెక్సీకి అడ్డు వచ్చిందన్న అక్కసుతో ఎమ్మెల్యే బలవంతంగా తీయించేశారని.. తన పొట్టమీద కొడతారా? అని ప్రశ్నించిన పాపానికి ఎమ్మెల్యే ఆయన్ను నానాదుర్భాషలాడారని ఆరోపించారు. దాంతో తీవ్ర మనోవేదనతో కనకరాజు మృతి చెందాడని వివరించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం చేస్తానని, అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారని.. అయితే కనీసం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి గానీ, చివరకు చంద్రన్న బీమా నుంచి కానీ ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయలేదని వారు వివరించారు. ఇంతకంటే దళితుల పట్ల వాసుపల్లి వివక్ష మరొకటి ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. -
ఉసురు తీసిన స్థల వివాదం
కాట్రేనికోన, న్యూస్‌లైన్ : కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో ఇంటి స్థలం విషయంలో చెలరేగిన వివాదంలో మోకా కనకరాజు (32)ను అతడి చెల్లెలి భర్త హతమార్చాడు. ఎస్సై పి.వెంకట త్రినాథ్ కథనం ప్రకారం.. కందికుప్పకు చెందిన కనకరాజు కొంత కాలం క్రితం తనకున్న భూమిలోని కొంత భాగాన్ని కట్నంగా ఇచ్చి ఇంటి పక్కనే ఉంటున్న పొద్దూక బాలయోగి అనే వ్యక్తితో తన చెల్లెలి పెళ్లి చేశాడు. ఈ ఇంటి స్థలం విషయంలో పలుమార్లు బావ బామరుదల మధ్య తగాదాలు తలెత్తగా కుల పెద్దలు సర్ధిచెప్పారు. ఈ నేపథ్యంలో బాలయోగి చెల్లి దాకే లక్ష్మి, దాకే సత్యనారాయణ అయినవిల్లి నుంచి బుధవారం ఇంటికి రావడంతో గొడవ మొదలైంది. కుల పెద్దలు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా మాట వినకపోవడంతో వెళ్లిపోయారు. గురువారం వేకువజామున పొద్దూక పండమ్మ, బాలయోగి, దాకే సత్యనారాయణ, దాకే లక్ష్మి, నాగాభక్తుల శ్రీను మూకుమ్మడిగా కనకరాజు ఇంటిపై దాడి చేశారు. ఇంటిని కూల్చివేసి, కనకరాజు గొంతు నులిమి, కత్తితో తలపై నరికి చం పారు. దాడి సమయంలో ఇంట్లో కనకరాజు తల్లి అప్పయమ్మ, చిన్న కుమారుడు ముఖేష్ ఉన్నారు. మృతుడి మామ కాశి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటత్రినాథ్ తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనకరాజు మృతితో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యా రు. భార్య వరలక్ష్మి, కుమారులు తేజలక్ష్మీ జగ న్, ముఖేష్ ఉన్నారు. భార్య విదేశాల్లో ఉండగా, పెద్ద కుమారుడు తేజలక్ష్మీ జగన్ ఇందుపల్లిలోని అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు ముఖేష్ మాత్రమే తండ్రితో ఉంటున్నాడు.