kanakadurga varadhi
-
కృష్ణా తీరం.. 'జనం క్షేమం'
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రూ.122.90 కోట్ల వ్యయంతో నిర్మించే వరద రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం కనకదుర్గమ్మ వారధి వద్ద ఈ పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ నిర్మాణం ప్రారంభంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ వాసుల చిరకాల స్వప్నం నెరవేరినట్లయింది. తద్వారా ఏటా వరదల సమయంలో తట్టా బుట్ట సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే బాధ విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రజలకు తప్పుతుంది. 1.5 కిలోమీటర్ల పొడవున కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు వరద రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సమయంలో సీఎం జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తే ముంపునకు గురికాకుండా ఉంటుందని అధికారులు సూచించారు. త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బుధవారం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) మేయర్ భాగ్యలక్ష్మి, స్థానిక 18వ డివిజన్ కార్పొరేటర్ అరవ వెంకట సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వీఎంసీ కార్పొరేటర్లను ముఖ్యమంత్రి పేరు పేరునా పలకరించి అభినందించారు. నదీ తీరంలో వంతెన కింద నిల్చొని ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు సీఎం చిరునవ్వుతో అభివాదం చేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలాగా రక్షణ గోడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది తీర ప్రాంతంలో నివసించే ప్రజల ఇళ్లలోకి వరదల సమయంలో నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని నిరాశ్రయులవుతున్నారు. 2019లో కృష్ణా నది వరదల సమయంలో విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన రాణిగారితోట, తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో సీఎం పర్యటించి వరద కష్టాలు, వ్యథల నుంచి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే రక్షణ గోడ నిర్మాణం కోసం 2020 జనవరి 13న రూ.122.90 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలాగా రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నారు. ఈ గోడ నిర్మాణం వల్ల దాదాపు 31 వేల మంది ప్రజలకు ముంపు నుంచి శాశ్వత ఉపశమనం లభించనుంది. -
కనకదుర్గ వారధి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : పూజ చేసుకుంటానని వచ్చి కనకదుర్గ వారధి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తిని తాడిగడపకి చెందిన మన్నేదుర్గాప్రసాద్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కనకదుర్గ వారధి వద్ద పూజ చేసుకుంటానని వెళ్లాడు. తమ్ముడి కొడుకు సుజిత్‌ని పూజ్ జరుగుతున్నంత సేపు వీడియో రికార్డ్ చేయమన్నాడు. దీంతో సుజిత్ ఫోన్లో రికార్డు చేస్తుండగా ఇక్కసారిగా దుర్గాప్రసాద్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో చనిపోతున్నానని దుర్గాప్రసాద్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులు సొంతం చేసుకున్నారు. అయితే కళ్ళ ముందే పెద్దనాన్న చనిపోవతంతో సుజిత్ షాక్‌కి గురయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం గాలిస్తున్నారు. -
లారీలు ఢీ...భారీ ట్రాఫిక్‌జామ్
సాక్షి, విజయవాడ : నగరంలోని కనకదుర్గ వారధిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ క్రమంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రెండు గంటలుగా ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. -
15 కోట్ల భూమికి.. 30 లక్షలు ఇస్తారా?
-
15 కోట్ల భూమికి.. 30 లక్షలు ఇస్తారా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వాటికి పప్పు బెల్లాలు ఇచ్చినట్లు ఇస్తే ఎలా కుదురుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గ వారధి వద్ద సీడ్ క్యాపిటల్ యాక్సెస్ హైవే బాధిత రైతులు, ఇతరులను కలిసి మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సీడ్ క్యాపిటల్ యాక్సెస్ అని రోడ్డు పెట్టి, దానికోసం 300 కుటుంబాలను నేలమట్టం చేసి, 25 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. ఇప్పటికే సూరాయపాలెం నుంచి మంగళగిరి టోల్ ప్లాజా వరకు ఎన్ హెచ్ 5, 9 లను లింక్ చేస్తూ, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయడానికి గత ప్రభుత్వం హయాంలోఏ భూములు తీసుకున్నా, చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల నుంచి ఇంతవరకు రోడ్డు పనులు మొదలుపెట్టలేదు. నిజంగా రోడ్డు పని చేసి ఉంటే, సీడ్ క్యాపిటల్ కు యాక్సెస్ అనేది అయిపోయి ఉండేది ఈ భూములు తీసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇప్పటికే భూములు తీసుకున్నా, విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు రోడ్డు కోసం భూములు సిద్ధంగా ఉన్నా.. పనులు చేపట్టలేదు. ఎవరైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త రాజధానికి రోడ్డు పనులు చేయాలి. ఈయన సీఎం అయి మూడేళ్లు కావస్తున్నా ఆ పని కావాలని ముట్టుకోకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ భూములను కూడా సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు పేరుతో 25 ఎకరాలు బలవంతంగా లాక్కుని, 300 కుటుంబాలను కూలుస్తున్నారు. ఇక్కడ ఎకరం 15 కోట్ల వరకు పలుకుతోంది. దానికి 30 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతుంటే తాము ఎలా బతకాలి, ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నారు. ఇక్కడ ఉన్నదంతా చిన్న, సన్నకారు రైతులే. 20 సెంట్లు, 40 సెంట్ల చొప్పున ఉన్నవాళ్లంతా ఈ రోడ్డు పుణ్యమాని రోడ్డున పడాల్సి వస్తోంది. అలా రోడ్డున పడేయడం ధర్మమేనా? అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. 25 ఎకరాల భూమికి ఎకరా 15 కోట్లు ఇచ్చి తీసుకొమ్మని అడుగుతున్నాం. మోసం చేసి, రోడ్డు మీద పారేయకండి. ప్రభుత్వమే లాక్కుంటే మేం ఎవరికి చెప్పుకోవాలని చంద్రబాబును ఇక్కడివారు నిలదీస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని హామీ ఇస్తున్నాం. ఇదే ప్రాంతంలో వేరే ఆవాసం కూడా కల్పించకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రమంతా చూసేలా చేయాలి. చంద్రబాబుకు తెలిసేలా వీళ్ల నోళ్ల నుంచి వస్తున్న మాటలతో ఆయనకు బుద్ధి రావాలని అనుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అడిగేది ఒక్కటే. పక్కనే విజయవాడ, అన్నీ ఫ్లాట్లే ఇక్కడ.. మేం ఫ్లాట్లు కట్టుకుంటే 15 కోట్ల వరకు వచ్చే పరిస్థితి ఉంది. పప్పు బెల్లాలు ఇచ్చి మా భూములు తీసుకుంటే సన్న, చిన్నకారు రైతులం ఏం చేయాలని అడుగుతున్నారు. మా భూములు తీసుకోవాలంటే పూర్తిగా ఎకరాకు 15 కోట్లు ఇచ్చి తీసుకోండి.. లేదా మా భూములు మాకు వదిలేయండని గట్టిగా అడుగుతున్నారు. వాళ్ల కోరిక సమంజసమే. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు, కానీ పేదవాళ్ల కడుపు కొట్టడం అభివృద్ధి కాదు, ధర్మంగా పేదవాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చి తీసుకోవాలి. ఆయనపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. 300 ఇళ్లు తీసుకునేటప్పుడు ఇదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి, ఆ తర్వాత ఇళ్లు తీసుకోవాలని అడుగుతున్న వారి కోరిక సమంజసమే. మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మిగిలిన గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా చంద్రబాబు గారికి అర్థమయ్యేలా చెబుతాం. ఈ పోరాటంలో మీకు అండగా ఉంటామని, ముందుండి పోరాడతామని హామీ ఇస్తున్నాం. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు బాధితులతో ముఖిముఖి మాట్లాడారు. వాళ్ల ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ తర్వాత ఎవరూ మంచి పనులు చేయలేదు ఆ 20 ఎకరాల్లో 45 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. చంద్రబాబు చేసే పని ఏమీ లేదు. ఎప్పుడో వైఎస్ఆర్ మంచి పనులు చేశారు. ఆ తర్వాత ఎవరూ మంచి పని అన్నది చేయలేదు. అందరికీ తలా అర ఎకరం, 40 సెంట్లు.. ఇలా పోతున్నాయి. -రామిరెడ్డి ప్రభుత్వమే లాక్కుంటే ఎవరికి చెప్పాలి మేమిక్కడ 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 30 సెంట్ల భూమి, ఒక చిన్న డాబా ఇల్లు ఉన్నాయి. ఇవి యాక్సెస్ రోడ్డు కోసం పోతున్నాయి. ఇప్పుడు మేం ఎలా బతకాలి? ఏడాది పొడవునా ఆ భూమిలో గులాబి పూలు వేసుకుని నెలకు 10 వేల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు, భూమి పోతే చిన్న పిల్లలతో మేం ఎలా బతకాలి? ప్రభుత్వమే మా భూములు లాక్కుంటే ఇక మేం ఎవరికి చెప్పుకోవాలి? -ఆశ పుష్కరాల నాడే ఇళ్లు తీసేశారు మేం చేపలు అమ్ముకుంటాం. అమ్మానాన్నల సమయం నుంచి మేం అక్కడే ఉండేవాళ్లం. పుష్కరాల సమయంలో ఇళ్లు తీసేశారు. తర్వాత వేరేచోట మమ్మల్ని ఉంచారు. అక్కడ దోమలు కుట్టి మా చెల్లెలు చనిపోయింది. మూడు నెలల్లో వేరేచోట ఇళ్లు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. చేపలు అమ్ముకునేవాళ్లను అమ్ముకోనివ్వరట, చేపలు పట్టుకోనివ్వడం లేదు. -మంగమ్మ -
రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో మృతి
కనకదుర్గ వారధి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పమిడిముక్కల ఎంపీడీవో బసవరాజు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. గుంటూరులో ఇంటి నిర్మాణం పనులు చూచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ తన ఇంటికి వెళుతున్న బసవరాజును కనకదుర్గ వారధి వద్దకు రాగానే ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బసవరాజు తల బస్సు వెనక టైరు కింద పడడంతో హెల్మెట్ ఉన్నప్పటికీ తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బసవరాజు ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
కనకదుర్గ వారధిపై భారీ అగ్నిప్రమాదం
గుంటూరు: వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పేయింట్ వేస్తున్న వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారి వద్ద ఉన్న పేయింట్కు యాక్సిడెంట్ ద్వారా పుట్టిన మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిమీద ఉన్న కనకదుర్గ వారధిపై గురువారం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.