kanca ailayya
-
పత్తికి మద్దతు ధర నిర్ణయించాలి
హైదరాబాద్: పత్తికి కనీస మద్దతు ధర నిర్ణయించి, రైతులను ఆదుకోవాలని టీ మాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుంటే రైతుల ఆత్మహత్యలు ఆగవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వింటా పత్తి ఉత్పత్తికి ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కలేసి లాభసాటి ధరను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం క్వింటాకు రూ. 3,310 ఖర్చు చేస్తున్నారని, దానికి అనుగుణంగా నాసిరకం పత్తికి క్వింటాకు రూ.4,500 ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ‘ధరలను షావుకార్లు ఎలా నిర్ణయిస్తారు, వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు.’అని ఐలయ్య ప్రశ్నించారు. పత్తి నాణ్యతను ప్రభుత్వ అధికారులే నిర్ణయించాలని కోరారు. జోకుడులో కూడా మోసం జరుగుతోందని, చదవుకున్న ప్రతి రైతుబిడ్డ తల్లిదండ్రులతోపాటు మార్కెట్‌కు వెళ్లి వ్యాపారుల మోసాలను ఎండగట్టాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వంతోపాటు మోసం చేస్తున్న షావుకారులు కూడా బాధ్యలేనని ఆరోపించారు. పార్టీలు, నాయకులు చందాల కోసం మార్కెట్ మోసాలను ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. పత్తి రైతుకు ఎకరాకు 20 వేల నష్టపరిహారం చెల్లించాలని, ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేయకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. టి మాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు కొనుగోలు చేసినవారిపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం నాయకులు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, మన్నారం నాగరాజు, శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ‘నాపై కేసులు కొట్టేయండి’ సాక్షి, హైదరాబాద్: తాను ‘సామాజిక స్మగ్లర్లు–కోమటోళ్లు’పేరుతో పుస్తకం రాసినందుకు తనపై మల్కాజ్గిరి, కోరుట్ల, కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ కంచ ఐలయ్య గురువారం హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఐలయ్య తన పిటిషన్లలో పేర్కొన్నారు. తాను ఏ కులాన్ని, వర్గాన్ని కించపరిచే ఉద్దేశంతో ఆ పుస్తకం రాయలేదని, పూర్వకాలంలో ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకునే రాశానని తెలిపారు. కోమట్ల చరిత్ర, సమాజంలో వారి పాత్ర, వారి ఆర్థిక స్థితిగతులు తదితర విషయాల గురించే రాశానన్నారు. స్మగ్లర్ అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్మగ్లర్ అన్న పదానికి నిఘంటువుల్లో ఉన్న అర్థాలను వివరించారు. రచయితగా తనకున్న వాక్ స్వాతంత్య్రాన్ని పట్టించుకోకుండా పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని వివరించారు. తన పుస్తకంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సైతం కొట్టేసిందని అన్నారు. పుస్తకం చదవకుండా అందులోని కొన్ని అంశాలనే తీసుకుని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. వర్తించని అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టారని వివరించారు. అంతేగాక ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లదన్నారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో బ్రాహ్మణులు, వైశ్యులే అధికం
హైదరాబాద్: దేశంలోని బడా కంపెనీలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా బ్రాహ్మణులు, వైశ్యులే అధిక శాతం ఉన్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. గురువారం ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి, టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంచ ఐలయ్య 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’ను నిర్వహించారు. ఓయూ సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలయ్య మాట్లాడుతూ, ప్రైవేటు రంగాల్లో ఉన్న వంద మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 46 శాతం వైశ్యులు, 44.6 శాతం బ్రాహ్మణులు కమ్మ, రెడ్లు 3.8 శాతం, ఎస్సీ, ఎస్టీలు 3.5 శాతం మాత్రమే ఉన్నారన్నా రు. అందుకే ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. తన రచనలు, మాటల్లో మహిళలను ఎక్కడ విమర్శించడంలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను, ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసి తెలుగు, ఇంగ్లిష్ మీడియాలలో విద్యా బోధన జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో దంసా అధ్యక్షుడు ధారవత్ మోహన్, ఉసా, నలిగంలి శరత్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. -
కులచిచ్చు పెట్టేవారిని ఉరితీయాలి
- ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి - ఎంపీ టీజీ వెంకటేశ్ హైదరాబాద్: కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని ఉరి తీసే చట్టాలు తీసుకురావాలని ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే రీతిలో కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని అందరూ ఖం డించాలన్నారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐలయ్యను కఠినంగా శిక్షించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగించాలని సమావేశంలో తీర్మానం చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ.. ఐలయ్యపై తెలుగు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కులాన్ని, మతాన్ని చివరకు జాతిపిత మహత్మాగాంధీని కూడా విమర్శిస్తూ రచనలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి రాతలు గల్ఫ్ దేశాల్లో రాస్తే రోడ్డుపై నరికేవారన్నారు. గతంలో మజ్లీస్ నాయకులకు, మతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కిరణ్‌కుమార్ సర్కారు చర్యలు తీసుకుందని, అదే విధంగా ఐలయ్యపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విదేశాల నుంచి వ్యాపారం చేసే వారికి మద్దతిస్తూ, ఈ దేశంలో పుట్టి.. ఈ దేశంలోనే వ్యాపారాలు చేస్తున్న ఆర్యవైశ్యులను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇతర దేశాల మద్దతుతోనే... ఇతర దేశాల మద్దతుతోనే ఐలయ్య దేశంలో అశాంతి సృష్టిస్తున్నారని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ అన్నారు. రాజ్యాంగ రచన చేసిన అంబేడ్కర్‌ను గౌరవి స్తామన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మా ట్లాడుతూ గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి మహానేతలు చూపిన అహింసా మార్గంలో నడిచే వైశ్యులు ఎవ్వరికీ హింస తలపెట్టలేదన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, వార్త ఎండీ గిరీశ్ సంఘీ, నటి కవిత, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, కర్ణాటక, తమిళనాడు అధ్యక్షులు అనిల్‌గుప్తా, శంకర్రావు, తెలంగాణ, ఏపీ ఆర్యవైశ్య మహాసభల అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, జయంతి వెంకటేశ్వర్లుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణలో మార్పు కనిపించడం లేదు
• మహాజన పాదయాత్రలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య • కేసీఆర్ సర్కారు తుగ్లక్‌ను తలపిస్తోంది: తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుతో నీరు, నిధులు, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన ప్రజలకు రెండేళ్లరుునా మార్పు కనిపించడం లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. రాష్ట్ర జనాభాలో 92 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి జరగనప్పుడు బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్రలో ఆయన బుధవారం పాల్గొన్నారు. నేదునూరు గ్రామంలో పాషానరహరి స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడి పోరాటం చేసిన పాషానరహరి దారుణంగా హత్యకు గురయ్యారన్నారు. ఆయన భూమి, భుక్తి కోసం మహత్తర పోరాటం చేసిన నేత అని కొనియాడారు. కేసీఆర్ సర్కారు తుగ్లక్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. రైతులు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. నేదునూరులోని మోడల్ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, బి.వెంకట్, జిల్లా కార్యదర్శి భూపాల్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సోమయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కె.రవి తదితరులు పాల్గొన్నారు.