కులచిచ్చు పెట్టేవారిని ఉరితీయాలి
- ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి
- ఎంపీ టీజీ వెంకటేశ్
హైదరాబాద్: కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని ఉరి తీసే చట్టాలు తీసుకురావాలని ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే రీతిలో కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని అందరూ ఖం డించాలన్నారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐలయ్యను కఠినంగా శిక్షించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగించాలని సమావేశంలో తీర్మానం చేశారు.
వెంకటేశ్ మాట్లాడుతూ.. ఐలయ్యపై తెలుగు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కులాన్ని, మతాన్ని చివరకు జాతిపిత మహత్మాగాంధీని కూడా విమర్శిస్తూ రచనలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి రాతలు గల్ఫ్ దేశాల్లో రాస్తే రోడ్డుపై నరికేవారన్నారు. గతంలో మజ్లీస్ నాయకులకు, మతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కిరణ్‌కుమార్ సర్కారు చర్యలు తీసుకుందని, అదే విధంగా ఐలయ్యపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విదేశాల నుంచి వ్యాపారం చేసే వారికి మద్దతిస్తూ, ఈ దేశంలో పుట్టి.. ఈ దేశంలోనే వ్యాపారాలు చేస్తున్న ఆర్యవైశ్యులను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇతర దేశాల మద్దతుతోనే...
ఇతర దేశాల మద్దతుతోనే ఐలయ్య దేశంలో అశాంతి సృష్టిస్తున్నారని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ అన్నారు. రాజ్యాంగ రచన చేసిన అంబేడ్కర్‌ను గౌరవి స్తామన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మా ట్లాడుతూ గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి మహానేతలు చూపిన అహింసా మార్గంలో నడిచే వైశ్యులు ఎవ్వరికీ హింస తలపెట్టలేదన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, వార్త ఎండీ గిరీశ్ సంఘీ, నటి కవిత, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, కర్ణాటక, తమిళనాడు అధ్యక్షులు అనిల్‌గుప్తా, శంకర్‌రావు, తెలంగాణ, ఏపీ ఆర్యవైశ్య మహాసభల అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, జయంతి వెంకటేశ్వర్లుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.