నియోజకవర్గంలో తండ్రి కాషాయ కండువా కప్పుకుని తిరుగుతున్నాడు. కొడుకేమో పచ్చ కండువా వేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో వారి కేడర్‌కు ఏ కండువా కప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పచ్చ పార్టీ సీటు మైనారిటీకి ఇస్తారనే ప్రచారంతో కొడుకు పార్టీని పట్టించుకోవడంలేదట. దీంతో అక్కడి రాజకీయాలు మరింత గందరగోళంగా మారాయనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరు?
లీడర్లలో క్లారిటీ మిస్ అయిందా?
గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు పచ్చ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేశ్... పార్టీ ఓటమితో చంద్రబాబు సలహామేరకు కాషాయ కండువా కప్పుకున్నారు. కాని ఆయన కుమారుడు భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. కర్నూల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వెంకటేశ్ కుమారుడు భరత్ ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలపడ్డారు. రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యాపారాల్లో మునిగిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహంతో వారి కేడర్‌లో అయోమయం కొనసాగుతోంది. మరోవైపు తండ్రి ఒక పార్టీలో...కొడుకు మరో పార్టీలో ఉండటం కూడా కేడర్‌ను ఇబ్బందికి గురిచేస్తోంది. తాము ఏ రంగు కండువా కప్పుకోవాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు.
కంచుకోట అలా బద్దలయింది.!
ఒకప్పుడు కర్నూల్ నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్ వర్గం బలంగా ఉండేది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టీజీ కంచుకోటను బద్దలు చేసింది. టీజీ భరత్ దారుణంగా ఓడిపోయాడు. రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్న టీజీ వెంకటేశ్ తన వర్గాన్నంతా కొడుకుకు అప్పగించాడు. వారంతా గత ఎన్నికల్లో పచ్చ జెండాలు పట్టుకుని భరత్ కోసం పనిచేశారు. ఓడిపోయాక భరత్ కేడర్‌ను పట్టించుకోవడం మానేశాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటుగా..కేడర్‌తో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో వారంతా చెల్లా చెదురవుతున్నారని తెలుస్తోంది. కేడర్ దూరం కావడం భవిష్యత్లో భరత్‌కే నష్టం అంటున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయాన్ని ముందే ఖరారు చేశారనే టాక్ నడుస్తోంది.
సైకిల్ కాదు కానీ..!
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలే మెజారిటీగా ఉండటంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతను ఎన్నికల బరిలో దించి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఏమాత్రం అవకాశాలు లేవని అర్థమవుతోంది. తండ్రీ కొడుకులు వేర్వేరు రాజకీయాలు చేస్తుండటం... కేడర్‌ను దూరం చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి కోసం టీడీపీ ఇన్‌చార్జ్ టీజీ భరత్ స్వయంగా బాటులు వేసుకుంటున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిజి భరత్ కు టిక్కెట్ వచ్చేట్లు కనిపించడంలేదని కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరు టిజి భరత్ కు దూరం అవుతున్నారు. టీజీ కుటుంబాన్ని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. తండ్రీ, కొడుకులు చెరో పార్టీలో ఉంటూ... కేడర్‌ను దూరం చేసుకోవడంతో మొత్తంగా కర్నూల్ తెలుగుదేశం పార్టీ అచేతనంగా మారిపోయింది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment