
హైదరాబాద్: దేశంలోని బడా కంపెనీలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా బ్రాహ్మణులు, వైశ్యులే అధిక శాతం ఉన్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. గురువారం ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి, టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంచ ఐలయ్య 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’ను నిర్వహించారు. ఓయూ సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఐలయ్య మాట్లాడుతూ, ప్రైవేటు రంగాల్లో ఉన్న వంద మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 46 శాతం వైశ్యులు, 44.6 శాతం బ్రాహ్మణులు కమ్మ, రెడ్లు 3.8 శాతం, ఎస్సీ, ఎస్టీలు 3.5 శాతం మాత్రమే ఉన్నారన్నా రు. అందుకే ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. తన రచనలు, మాటల్లో మహిళలను ఎక్కడ విమర్శించడంలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను, ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసి తెలుగు, ఇంగ్లిష్ మీడియాలలో విద్యా బోధన జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో దంసా అధ్యక్షుడు ధారవత్ మోహన్, ఉసా, నలిగంలి శరత్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.