Kancili
-
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలి అదృశ్యం
కంచిలి: మండలంలోని పోలేరు ప్రాదేశికం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎంపీటీసీ సభ్యురాలు కప్ప జయమ్మ, ఆమె భర్త జానకీరావు నాలుగు రోజుల నుంచి కనిపించడంలేదు. ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ కొత్త కార్యవర్గం ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఈమెతో పాటుభర్త అదృశ్యం కావడం సర్వత్రా చర్చలకు తెరతీసింది. వీరి ని తెలుగుదేశం పార్టీ నేతలు కిడ్నాప్ చేసి ఉంటారనే పుకార్లు వినిపిస్తున్నాయి. మండలంలో 19 ప్రాదేశికాలు ఉండగా, రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 17 ప్రాదేశికాలకు ఎన్ని క నిర్వహించగా వైఎస్సార్సీపీకి 12 స్థానా లు, టీడీపీకి 05, కాంగ్రెస్‌కు 01 స్థానం దక్కాయి. టీడీపీ అభ్యర్థి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలంటే మరో నాలుగురు ఎంపీటీసీల బలం అవసరం. ఇందు లో భాగంగానే వైఎస్సార్సీపీకి చెం దిన నలుగురు ఎంపీటీసీ సభ్యుల మద్దతు పొందే ఎత్తుగడలో భాగంగా పోలేరు ఎంపీటీసీ అదృశ్యం జరిగినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ కుటుంబాలపై విశృంఖల దాడులు
కంచిలి, న్యూస్‌లైన్: ఇళ్లలో పురుషులెవరూ లేరు. ఇదే అదనుగా భావించారు ప్రత్యర్థులు. రాత్రి వేళ దాడులకు తెగబడ్డారు. కర్రలు, కత్తులు, రాళ్లతో ఇళ్లలోకి దూరి రెండు గంటల పాటు బీభత్సం సృష్టించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. ఇది తెలుసుకొని పరుగున వచ్చిన పురుషులపైనా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కంచిలి మండలం జాడుపూడి కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ విధ్వంసకాండలో బాధితులు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కాగా.. దాడులకు తెగబడినవారు కాంగ్రెస్ మద్దతుదారులు. జాడుపూడి కాలనీలో ఉన్న రెండు సామాజికవర్గాలు రెండు పార్టీల మద్దతుదారులుగా విడిపోయారు. ఈ రెండు వర్గాల మధ్య చాలాకాలంగా కక్షలు కొనసాగుతున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పెద్దలు కల్పించుకొని రాజీ చేశారు. కాగా శుక్రవారం రాత్రి అంపురంలో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల కుటుం బాల్లోని పురుషులందరూ వెళ్లారు. ఆ కుటుం బాల్లో ఆడవాళ్లు, పిల్లలే ఇళ్లలో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ మద్దతుదారులు ఆడా మగా కలిసి సుమారు 20 మంది వరకు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ ఇళ్లపై దాడి చేశారు. రాత్రి 8.30 నుంచి 10.30 గంటల వరకు రెండు గంటలపాటు విశృంఖలంగా వ్యవహరించారు. ఇళ్లలో దూరి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ఇతర సామాన్లను చిందరవందర చేశారు. ఇళ్ల తలుపులు పగులగొట్టారు. ఈ విషయం తెలుసుకుని వివాహానికి వెళ్లిన బాధిత కుటుంబాల పురుషులు హుటాహుటిన గ్రామానికి చేరుకోగా.. వారిని కూడా కత్తులు, కర్రలు, రాళ్లతో కొట్టారు. దాంతో వారు కూడా ఎదురు తిరిగారు. ఈ సంఘటనలో వైఎస్ఆర్సీపీకి చెందిన పది మందికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరందరినీ సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాగా కాంగ్రెస్ మద్దతుదారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెందిన రెండు ఇళ్లలో విధ్వంసం సృష్టించారు. ఒక ఇంట్లో ఉన్న టీవీ పగులగొట్టి, బీరువాలో ఉన్న సామాన్లను చిందరవందర చేశారు. బీరువాలో భద్రపర్చిన రూ.20 వేల నగదును, తన మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలు, పుస్తెల తాడును తెంచుపోయారని బాధితురాలు మక్క కుమారి ఆరోపించారు. ఈ గొడవలో వైఎస్ఆర్సీపీకి చెందిన మక్క కుమారి, జానకీరావు, నూకరాజు, క్రిష్ణారావు, లోలాక్షి, మక్క పుష్ప, మిర్యాల కేశవరావు, పిలక జగన్నాయకులు, రెడ్డిపల్లి పోలయ్య, నర్సమ్మలు గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అయితం వైకుంఠరావు, భార్య లక్ష్మి, అయితం లోలాక్షి, పొట్టమ్మ, గంట శివకుమార్, మిరయాల రామయ్యలు కూడా గాయాలపాలయ్యారు. సంఘటనపై ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు వర్గాలకు చెందిన 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఏఎస్ఐ బి.వి. రామక్రిష్ణ తెలిపారు. రక్షణ కల్పించాలి జాడుపూడి కాలనీలో నివసిస్తున్న తమ ఆరు కుటుంబాలకు రక్షణ కల్పించాలని బాధిత వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల కుటుంబాలకు చెందిన మహిళలు కోరారు. గ్రామానికి వెళ్లిన విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గానికి చెందిన సుమారు 20 కుటుంబాలవారు తమపై దాడులకు పాల్పడుతున్నారని, ఒంటరిగా దొరికితే ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే తప్ప ఊరిలో ప్రశాంతంగా నివసించలేమని అన్నారు. -
కారు బోల్తా.. ఒకరి దుర్మరణం
కంచిలి, న్యూస్‌లైన్: మండలంలోని కంచిలి బైపాస్ రోడ్డులో బలియాపుట్టుగ గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి కటక్ వెళుతున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా నుంచి కటక్ వద్ద గల జాజిపూర్‌కు చెందిన సందీప్ కుమార్ పుష్టి(31) అనే వ్యక్తి మృతిచెందాడు. కారు డ్రైవర్ జితేంద్ర కుమార్ తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదానికి దారి తీసిన వివరాలిలా ఉన్నాయి... ఒడిశాకు చెందిన సందీప్ కుమార్ పుష్టి, అతని స్నేహితుడు పక్కగ్రామానిక చెందిన సందీప్‌కుమార్‌తో హైదరాబాద్ నుంచి ఒడిశాలో ఉన్న తమ స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. దురదృష్టవశాత్తు రైలు వెళ్లిపోవడంతో హైదరాబాద్ నుంచి సోమవారం కారులో తమ గ్రామానికి బయల్దేరారు. మంగళవారం ఉదయం కంచిలి వద్దకు వచ్చేసరికి కారు నడుపుతున్న అతని స్నేహితుడు జితేంద్రకుమార్‌కు రాత్రంతా నిద్రలేక పోవటంతో నడిపేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు దిగువకు దింపేయటంతో చాలా దూరంపాటు రాసుకొంటూ వచ్చి బోల్తాపడింది. కారు నుంచి బయటపడ్డ సందీప్‌కుమార్ పుష్టిపై కారు ఎక్కింది. దీంతో అపస్మాకరక స్థితికి చేరాడు. స్థానికులు దీన్ని గమనించి కారు కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ఇద్దర్నీ సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సందీప్‌కుమార్ పుష్టి మృతిచెందాడు. కారు నడుపుతున్న జితేంద్రకుమార్‌కు చెయ్యి విరిగి తీవ్రగాయాల పాలయ్యాడు. కంచిలి హెచ్‌సి తులసిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రైలులో వెళ్లి ఉంటే ప్రమాదం నుంచి బయట పడేవారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో పడి వ్యక్తి మృతి నందిగాం, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పెద్దతామరాపల్లి గ్రామానికి చెందిన వగాడి జగన్నాయకులు (42) స్థానిక మంచినీటి కోనేరులో పడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం సాయంత్రం ఉపాధి పనులకు వెళ్లిన జగన్నాయకులు చెరువులో స్నానం చేసేందుకని వెళ్లి తిరిగి రాలేదు. అయితే ఈయన చెరువులో మునిగిపోయాడనే విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఆయన ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతతిరిగినా ఆచూకీ లభ్యం కాలేదు. తీరా మంగళవారం ఉదయం స్థానిక మంచినీటి కోనేరులో తల పైకి తేలి ఉండటం కొంతమంది స్థానికులు గమనించారు. చెరువులో దిగి చూడగా జగన్నాయకుల మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మృతునికి భార్య శకుంతల, కుమారుడు అనిల్‌కుమార్ తొమ్మిదో తరగతి, కుమార్తె కావ్య ఏడో తరగతి చదువుతున్న వారు ఉన్నారు. శవ పంచనామా అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. హెచ్‌సీ తులసీ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2 తల్లీకూతురుఃఎంపీటీసీ నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలంటే ఎన్నో తమాషాలు, ఎన్నో వింతలు ఉంటూనే ఉంటారుు. అలాగే నరసన్నపేటలోనూ చోటుచేసుకుంది. వేరు వేరు చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన తల్లీ, కూతురు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేగాక ఇద్దరి మోజార్టీ కూడా ఒకటే కావడం మరో విశేషం. ఈ తల్లీ కూతురు ఇద్దరూ 375 మోజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకివలస, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీచేసిన తల్లి శిమ్మ పార్వతమ్మ, కూతురు నేతింటి భారతి ఇద్దరూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.