మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలి
ఒంగోలు : ప్రకాశం జిల్లా చెర్లోపాళెంలో సమీపంలో శనివారం ఉదయం పెళ్లి బృందం వ్యాన్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కందుకూరు ప్రభుత్వాసుపత్రిలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎం అశోక్‌రెడ్డి పరామర్శించారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎం వాహనంలో మానకొండలోని ఆలయానికి వెళుతున్నారు. ఆ క్రమంలో కందుకూరు వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు.. డీసీఎం వాహనాన్ని ఢీకొంది.
ఈ సంఘటనలో బస్సు క్యాబిన్లోకి డీసీఎం దూసుకుపోవడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. డీసీఎం ఢీకొట్టిన వెంటనే బస్సు పక్కనున్న కాల్వలోకి బోల్తాకొట్టింది. పెళ్లి బృందంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 25మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఐదుగురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు.