kannareddy
-
వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు!
వికారాబాద్: బీటెక్ విద్యార్థి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి (ఏవో) నీరజ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడారు. ఎరువుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు తాను లంచం అడిగినట్టు కన్నారెడ్డి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె చెప్పారు. వెంటిలేటర్ లేకపోవడంతోనే ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతించలేదని అన్నారు. వ్యవసాయ కార్యాలయంలో తనతోపాటు మరో ఇద్దరు మహిళా అధికారులున్నారని, తమ పట్ల కన్నారెడ్డి, వారి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, అందుకే పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. రాత్రికి రాత్రే తనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందని ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరగా.. ఏవో నీరజ రూ. 20 వేలు లంచం ఇవ్వాలని అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో అతనిపై స్థానిక పోలీసులతో దాడి చేయించినట్టు కథనాలు వచ్చాయి. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. దీంతో తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్‌పేట్ ఎస్సై రాజులపై పోలీసుల కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఏవో నీరజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్ ఆదేశం
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతి విషయంలో కన్నారెడ్డి, మండల వ్యవసాయాధికారి (ఏఓ) నీరజ మధ్య జరిగిన వాగ్వాదం పోలీసు కేసుకు దారి తీసింది. ఈ విషయంలో స్పందించిన మోమిన్‌పేట ఎస్ఐ రాజు.. కన్నారెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ఎస్ఐ, ఏఎస్ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఏఓ నీరజపై జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ విచారణకు ఆదేశించారు. కాగా.. పోలీసుల దెబ్బలకు తీవ్ర అస్వస్థతన గురైన కన్నారెడ్డికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ కేసుపై స్పందించిన మంత్రి కేటీఆర్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, వ్యవసాయాధికారిపై సొంత శాఖకు చెందిన ఉన్నతాధికారులే విచారణ చేస్తుండడంతో న్యాయం జరగదని బాధితులంటున్నారు. మెజిస్ట్రీరియల్ విచారణ చేయించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు. -
కన్నారెడ్డిపై దుర్మార్గం.. నీరజ, ఎస్సైపై కేసు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బీటెక్ విద్యార్థినిపై అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లంచం ఇవ్వలేనన్నందుకు పోలీసులు, స్థానిక వ్యవసాయ అధికారిణి నీరజ కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్‌పేట్ ఎస్సై రాజులపై తాజాగా మంగళవారం పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్థానిక వ్యవసాయ అధికారి నీరజను కోరగా.. లైసెన్స్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం ఇవ్వాలని ఆమె అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై కన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ ఆధారాలు కోరడంతో ఆధారాలు సేకరించేందుకు అతను ప్రయత్నిస్తుండగానే.. ఈ విషయం తెలుసుకున్న నీరజ తన భర్తను పిలిపించుకొని అతనిపై దాడి చేసింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. అత్యంత దారుణంగా అతనిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని కుటుంబసభ్యులుఆరోపిస్తున్నారు. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. చేతులతో కనిపించని దెబ్బలు కొట్టడంతో కన్నారెడ్డి రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని, ఇప్పటికే ఓసారి డయాలసిస్ చేశామని, భవిష్యత్తులోనూ ఈ దెబ్బల వల్ల అతని ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముందని వైద్యులు చెప్తున్నారు. తమ కొడుకును దారుణంగా కొట్టి హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే లంచం అడిగిన ఏవో నీరజపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నారెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు.