వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు!
వికారాబాద్: బీటెక్ విద్యార్థి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి (ఏవో) నీరజ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడారు. ఎరువుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు తాను లంచం అడిగినట్టు కన్నారెడ్డి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె చెప్పారు. వెంటిలేటర్ లేకపోవడంతోనే ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతించలేదని అన్నారు.
వ్యవసాయ కార్యాలయంలో తనతోపాటు మరో ఇద్దరు మహిళా అధికారులున్నారని, తమ పట్ల కన్నారెడ్డి, వారి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారని, అందుకే పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. రాత్రికి రాత్రే తనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందని ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరగా.. ఏవో నీరజ రూ. 20 వేలు లంచం ఇవ్వాలని అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో అతనిపై స్థానిక పోలీసులతో దాడి చేయించినట్టు కథనాలు వచ్చాయి. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. దీంతో తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్‌పేట్ ఎస్సై రాజులపై పోలీసుల కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఏవో నీరజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.