కళా కృషీవలుడు కానూరి
తొంభైతొమ్మిది దాటితే నూరులో ప్రవేశించినట్లే. 1916లో పుట్టిన కానూరి వెంకటేశ్వ రరావు - కానూరితాత ఖమ్మంలో 2015 మార్చి 10వ తేదీన కన్నుమూశారు. 1915లో గురజాడ కన్నుమూసిన ఏడాదికి కళ్లు తెరచిన కానూరి వరంగల్లో తాను రాసిన గుర జాడపై ‘మహోదయం’ బుర్రకథతోనే నాకు పరిచయమయ్యారు. అట్లూరి, కానూరి, కాశీవిశ్వనాథంల కుటుం బాలు, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 1956లో ములుగు ఘనపురానికి భూములు కొనుక్కొని వచ్చినారు. ములుగు ప్రాంతపు పోరాట యోధుడు రామనర్సయ్య సహకారంతో ఈ కుటుంబాలన్నీ ములుగు ఘనపురంలో వ్యవసాయ జీవితంలో స్థిరపడి రామనర్సయ్య రాజకీయాలతోపాటు మార్పువైపు పయనిస్తూ వచ్చాయి. కానూరి దమయంతమ్మ దంపతులను ఎప్పుడు చూసినా నాకు ఆ బాల్యంలో మనసుమీద నిలిచిపోయిన రైతుల ముఖాలే గుర్తుకొచ్చేవి.
అయితే మమ్మల్ని గాఢానుబంధంలోకి తెచ్చింది వ్యవసాయ విప్లవం, విరసం. కానూరి విప్లవ సాంస్కృతిక రంగంలో క్రమశిక్షణ గల నికార్సయిన కార్యకర్తగా కనిపించడమే కాదు, ఆఖరిశ్వాస దాకా రుజు వు చేశాడు. పాటలు, గేయరూపకాలు, నాటకాలు, నాటికలు రాయ డం, పాడడం, శిక్షణ ఇవ్వడంలో ఆయనకు ఐక్య కమ్యూనిస్టు పార్టీ నేర్పిన దృఢమైన, సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. ఆయ నకు ప్రముఖ కమ్యూనిస్టు నేతలతో, ప్రజానాట్య మండలి నాయకులతో కలిసి పని చేసిన అపారమైన అనుభవం ఉండేది. ‘కృష్ణ’ పేరుతో కేఎస్ రాసిన ‘ప్రజానాట్య మండలి’ అనుభవాలు ఆయనకు చాలా ఇష్టమైన పుస్తకం.
వరంగల్ విరసంకు కానూరి సాంస్కృతిక సేనానిగా ఒక పెద్ద దిక్కయ్యాడు. 1970 జూలై 4న హైదరాబాద్లో విరసం ఏర్పడగానే నిండు హృదయంతో స్వాగతం పలికి అక్టోబర్లో ఖమ్మం పాణిగ్రాహినగర్లో ప్రథమ మహాసభలకు వచ్చి కానూరి, అట్లూరి, కాశీలు విరసంలో చేరిపోయారు. 1985లో డాక్టర్ రామనాథం హత్యదాకా పదిహేనేళ్లు మేము రెడ్డికాలనీలో, కుమార్పల్లిలో నిత్య సాంస్కృతిక సహ బాటసారులం. డాక్టర్ రామనాథంగారి హత్యతో వరంగల్లో విప్లవ, ప్రజాస్వామిక బుద్ధిజీవుల కుటుంబాలు చాలా వర కు చెల్లాచెదురయ్యాయి. వెంటనే నేను, నా కుటుంబం 90లో వరంగల్ వదిలేయాల్సి వచ్చింది. 1985లోనే కానూరి విరసం నుంచి కూడా నమ్ము మొదలైన వారితోపాటు వెళ్లిపోయాడు. అరుణోదయ సాంస్కృ తిక సమాఖ్య స్థాపన నుంచి తాను కన్నుమూసే దాకా ఆయనే దానికి చుక్కాని. విరసంకు జనసేన, చెరబండరాజు, ఎన్కేలతోపాటు ఒక గాయక, సాంస్కృతిక కాణాచి కానూరి. అంతేకాదు గంగిరెడ్డి రాసిన ‘నాంది’ తర్వాత, అంటే 1972 తర్వాత మళ్లా బుర్రకథలు, నాటికలు, నాటకాలు విరసం సభ్యులకెందరికో నేర్పి ‘ప్రగతి బాగోతం’ ప్రదర్శన లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పించినవాడాయనే. కమ్యూనిస్టు రాజకీయాలకు 70 ఏళ్లు, విప్లవ రాజకీయాలకు 45 ఏళ్లు కళా సాంస్కృతిక రంగాల్లో ప్రచారం చేసిన ఏకైక సాంస్కృతిక యోధుడాయన.
భారతదేశంలో కష్టజీవికి వ్యక్తీకరణ కానూరి. ప్రేమ్ చంద్ నవలల్లోని రైతువలె కనిపిస్తాడు. నిరాడంబరుడు. కావి రంగు బట్టలు. ముక్కుసూటి మనిషి. కాళోజీకి వలెనే ముక్కు మీద కోపం. అంతట్లోనే వర్షం వెలిసిన ఆకాశంలోని ఎరడా లువలె నిష్కల్మషమైన స్నేహం. 1946 నుంచి 51 దాకా నిషే ధింప బడిన కమ్యూనిస్టు పార్టీ సంబంధాల వలన అజ్ఞాత జీవితం, అరెస్టు, చిత్రహింసలు. తోటివారందరూ తళనియప్పన్ హంతకచర్య లకు బలి అయిపోతే కింది అధికారులు కళాకారుడనే సానుభూతితో కానూరిని మృత్యుముఖం నుంచి కాపాడారు. 1956లో మళ్లా ఘనపు రంలో ప్రారంభమైన వ్యవసాయ జీవితం నుంచి రామనర్సయ్య సాన్ని హిత్యం ఆయనను మళ్లీ 1968 నుంచీ విప్లవంలోకి లాగింది. విరసం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, గత ముప్పైఏళ్లుగా పూర్తికాలపు విప్లవ సాంస్కృతిక జీవితం ఇంచుమించు దేశ సంచారంలో పార్టీ ఆఫీ సులో గడిచిపోయింది. ఖమ్మంలో న్యూడెమోక్రసీ ఆఫీసులో చనిపోయి నప్పుడు సంచీలో మిగిలిన సాహిత్యమే ఆయన మిగిల్చుకొని సాంస్కృ తిక వారసులకు ఇచ్చిన ఆస్తి.
(నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కానూరి సంస్మరణ సభ)
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు : సెల్:9676541715