ఎన్.తిర్మల్
నివాళి
తెలుగునేల సృష్టించుకున్న జానపద అద్భుతం-బుర్రకథ. ఉద్యమ వ్యాప్తికీ, సామాజిక చైతన్యానికీ అదొక ఆయుధం. దానికి మరింత పదును పెట్టిన ప్రజా కళాకారుడు కానూరి.
‘మహాత్యాగుల జీవితగాథల మనన జేతుమమ్మా!
మహాభారత స్వాతంత్య్రవీరుల మదిని తలచరమ్మా!’
అంటూ బుర్ర కథ ద్వారా ధన్యజీవులను ప్రజానీకానికి పరిచయం చేసిన కానూరి తాత (వెంకటేశ్వరరావు) ఇకలేరు. తెలంగాణ సాయుధ పోరాటంలో సాంస్కృతిక కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి, ఏడు దశాబ్దాల పాటు సాంస్కృతికోద్యమానికి సేవలు చేసిన కానూరి తాత శుక్రవారం (10-4-2015) ఖమ్మంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో కన్నుమూశారు. నిండా నూరేళ్లు జీవించి, మూడు తరాల కళాకారుల మధ్య వారథిగా నిలిచారు. వేలాది కవులకూ, కళాకారులకూ ఆయన మార్గదర్శి. తెలుగునాట వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ పండించి అవకాశవాద రాజకీయా లను తూర్పారా పట్టారు. బుర్రకథ, హరికథ, చిందు భాగవతం, పిట్టలదొర -ఇలా ఎన్నో రకాల కళారూపాలను ప్రజలను చైతన్య పరచ డానికి ప్రయోగించారు.
కానూరి స్వగ్రామం కృష్ణాజిల్లా కోడూరు గ్రామం. మాణిక్యమ్మ, సిద్ధయ్య దంపతులకు 1916లో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వేళ పుట్టిన కానూరి విప్లవోద్యమాలతో ప్రేరణ పొంది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీవైపు మొగ్గారు. 1944లో ప్రజా నాట్యమండలి ద్వారా బుర్రకథ కళాకారునిగా రంగప్రవేశం చేసి 70 ఏళ్లు అలరించారు. వంత గాడిగా, వ్యాఖ్యాతగా తనదైన శైలిని ఆవిష్క రించారు. శ్రీకాకుళ పోరాటాన్ని కళ్లకు కట్టే ఆయన ‘జనగానం’ ఎంతో ప్రసిద్ధి. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్‌సింగ్ చరిత్రలను కూడా బుర్రకథలుగా మలిచారు. కేవీ రమణారెడ్డి రాసిన ‘మహోదయం’ ఆధారంగా గురజాడ జీవిత చరిత్రను బుర్రకథ రూపంలోకి తెచ్చారు. వ్యంగ్యాన్ని మేళవించి వర్తమాన రాజకీయాలపై ఆయన రాసిన పాటలు ఎంతో ఖ్యాతి చెందాయి. సింగరేణి కార్మికుల వెతలకు అద్దంపడుతూ రాసినది ‘బాయి భాగోతం’. దీనిని అరుణోదయ కళాకారులు వందలాది పర్యాయాలు ప్రదర్శించారు. కానూరి ‘విప్లవ సింహం’ (రామనరసయ్య జీవితచరిత్ర బుర్ర కథ), ‘వెలుగురే ఖలు ’ (నీలం రామచంద్రయ్య జీవితం ఆధారంగా రాసిన హరికథ) వినని వారు ఉండరు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు, అరసం, విరసం, ప్రజా రచయితల సంఘం వంటి సంస్థలలో ఆయన పనిచేశారు.
(వ్యాసకర్త అరుణోదయ సభ్యుడు)
మొబైల్: 94418 64514