కాపులు ఐక్యంగా ఉండాలి
ఏలూరు సిటీ : ‘కాపు సామాజిక వర్గం వాడిని కాబట్టే ఉపముఖ్యమంత్రి పదవి వచ్చింది.. కాపులు ఏకతాటిపైకి వచ్చి ఒకే నాయకత్వంలో పనిచేయాలి.. అన్ని కులాల వారిని కలుపుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఏలూరు నగర కాపునాడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని కాశీవిశ్వనాథ కల్యాణ మండపంలో కాపు సామాజిక వర్గ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి చినరాజప్ప మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ శాతం పెంచి కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కాపులను మోసం చేసిందని, బొత్స సత్యనారాయణ రాష్ట్ర కాపు నేతగా ఉంటూనే నమ్మించి మోసం చేశారన్నారు.
నేడు టీడీపీకి కాపులు అండగా ఉన్నారనే అభిప్రాయం పార్టీలో ఉందని చెప్పారు. కాపు పెద్దలు ఓసీలుగా ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావించే కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని పట్టించుకోలేదన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో వంగవీటి మోహననరంగా, ముద్రగడ పద్మనాభం తదితర నేతలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) మాట్లాడుతూ మన కులంతోనే మనకు లాభం జరగాలని, ఇతర కులాలకు నష్టం ఉండకూడదని సూచించారు. జిల్లాలో కాపులు గర్వించేలా ఏలూరులో ఎస్వీ రంగారావు పేరుతో కల్యాణమండపం నిర్మిస్తానని చెప్పారు. కాపునాడు రాష్ట్ర కార్యదర్శి బీఎల్ నరసింహరావు మాట్లాడుతూ కాపులు లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాదని, కాపులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. 5 శాతం ఉన్న కమ్మ కులస్తులకు, 6 శాతం ఉన్న రెడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, 30 శాతం ఉన్న కాపులను పట్టించుకోవటంలేదని అభిప్రాయపడ్డారు.
కాపునాడు ఆహ్వాన కమిటీ కన్వీనర్ యిరదల ముద్దుకృష్ణ మాట్లాడుతూ కాపులు విద్యరంగంలో అభివృద్ధి సాధించాలని కోరారు. తూర్పు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో వైద్య కళాశాల నిర్వహించాలని, కాపు యువతకు సివిల్స్ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలన్నారు. పాలకొల్లు మునిసిపల్ చైర్మన్ నారాయణమూర్తి మాట్లాడుతూ కాపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకముందే వారి కి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్.రామచంద్రరావు, కాపునాడు నగర అధ్యక్షుడు జల్లా హరికృష్ణ, నగర డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, గూడెం మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రసంగించారు. చినరాజప్ప, బడేటి బుజ్జిని సన్మానించారు.
పలువురు ప్రముఖుల గైర్హాజర్
ఈ సమావేశానికి ఆహ్వానం అందుకున్న మంత్రి మాణిక్యాలరావు, డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు పులవర్తి రామాంజనేయులు, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు గైర్హాజరయ్యారు.