తాతయ్య చివరి కోరిక కోసం..
‘అమ్మా... ఆ చెట్టును నువ్వొకసారి తాకి రావాలి’ అని కోరాడు ఆమె తాత చనిపోయే ముందు. అమ్మమ్మలు, తాతయ్యల మాటల్ని చాదస్తంగా తీసి పారేసేవారు ఉన్న ఈరోజుల్లో ఆ మనవరాలు తాత చివరి కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. దేశ విభజనకు ముందు తన తాత ఏ చెట్టునైతే పొలంలో తన నీడగా చేసుకున్నాడో ఆ చెట్టును తాకింది.తన పూర్వీకుల స్వగ్రామంలోని మట్టిని మూట గట్టుకుంది. ఇంకా అక్కడే ఉన్న తన వాళ్లను చూసి ఆనందబాష్పాలు రాల్చింది. పెద్దవాళ్ల గుండెల్లో గాఢంగా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని వారు జీవించి ఉండగానే నెరవేరిస్తే ఆనందం. మరణించాక నెరవేరిస్తే మనశ్శాంతి.‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చి, ఇంత పేరు గడించినా సినీ కవి గుల్జార్‌కి గుండెలో ఒక కోరిక ఉండిపోయింది. అది పాకిస్తాన్‌లోని తన పూర్వీకుల సొంత ఊరిని చూసి రావాలనేది. ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా అతనికి అనుమతి దొరకలేదు. చనిపోయేలోపు చూస్తానో లేదో అంటాడాయన. దేశ విభజన వల్ల రాత్రికి రాత్రి కుటుంబాలు చెదిరిపోయి కొందరు ఇండియా చేరారు... కొందరు పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ఇరు దేశాలలో సెటిల్ అయిన వారి తలపోతల గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. రాకపోకలు జటిలం అయ్యాక ఇక బంధాలు ఫోన్లకు పరిమితం అయ్యాయి. పంజాబీలు అధికంగా ఈ ఎడబాటును భరించారు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల వయసున్న రీనా చిబ్బేర్ అనే ఆమె ‘రావల్పిండిలో మా పూర్వీకుల ఇల్లు చూసి రావడానికి అనుమతి ఇవ్వండి’ అని వేడుకుంటే ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆమె ఎంతో సంబరంగా వెళ్లడం ప్రధాన వార్తాంశం అయ్యింది. అయితే దేశ విభజన సమయంలో జలంధర్‌కు వచ్చి స్థిరపడిన బహదూర్ సింగ్‌కి మాత్రం అలాంటి కోరిక నెరవేరలేదు. 1947లో అతను తన చిన్న తమ్ముణ్ణి తీసుకుని ఇండియా వచ్చేశాడు. నడిమి తమ్ముడు అక్కడే ఉండిపోయాడు. ‘మా తాత చనిపోయే వరకూ కూడా పాకిస్తాన్లో ఉన్న తమ్ముణ్ణి గుర్తు చేసుకుని ఏడ్చేవాడు. ఆ అన్నదమ్ములు మళ్లీ జీవితంలో కలవకుండానే కన్ను మూశారు’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్. ఆమె ఇటీవలే తాత కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌కు దగ్గరగా ఉన్న తమ పల్లెను దర్శించింది.ఆ ఇల్లు... ఆ చెట్టు‘మా తాతది సియోల్‌కోట్ దగ్గర ఉన్న పల్లెటూరు. ఆయన పొలంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ ఇంటిని, చెట్టును ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. వాటి గురించి కథలు కథలు చెప్పేవారు. ఆ చెట్టును ఒకసారి తాకి రావాలి. తల్లీ అనేవారు నాతో. జలంధర్ వచ్చేశాక ఆయన తన తమ్ముడికి ఎన్నో ఉత్తరాలు రాశారు. కానీ 1986లో గాని వాటికి జవాబు రాలేదు. అప్పటికే మా తాత నడిమి తమ్ముడు ఇస్లాంలోకి మారాడు. అయితే మా ఇంటి పేరును ‘గుమర్’ని వదలకుండా తన పేరు గులామ్ ముహమ్మద్ గుమర్ అని పెట్టుకున్నాడు. ఆ ఇంటిని ఆ చెట్టును అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయాక ఆయన కొడుకు కుటుంబం మా జ్ఞాపకాలను పదిలంగా ఉంచిందని అర్థమయ్యాక ఎలాగైనా వెళ్లాలని తాతయ్య కోరిక నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను’ అంది కరమ్‌జిత్ కౌర్.ఘన స్వాగతం‘నేను పాకిస్తాన్ వెళుతున్నానంటే మా అత్తగారి కుటుంబం వద్దంటే వద్దంది. నాక్కూడా చాలా భయాలు కలిగాయి. కాని అక్కడ నేను అడుగు పెట్టగానే మా నడిమి తాత కుమారుడు నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. నా పెళ్లి కార్డు జాగ్రత్తగా దాచుకుని ఉన్నారు. మా తాత రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అప్పట్లో మా ఇంట్లో వాడిన తిరగలి అలాగే ఉంది. మా పొలంలో రావిచెట్టు సంగతి చెప్పనక్కర్లేదు. కళకళలాడుతోంది. మా బంధువులు, రక్త సంబంధీకులు అందరూ కన్నీటి పర్యంతం అయ్యి మర్యాదలు చేశారు. మా వూరి మట్టి తీసుకుని తిరిగి వస్తున్నాను’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్.కష్టసాధ్యమైన తాత కోరికను కొద్దిగా అయినా తీర్చిందీ మనవరాలు. ‘ఒరేయ్... కాశీ చూపించరా’, ‘మా ఊరు చూపించరా’, ‘ఫలానా బంధువు ఇంటికి తీసుకెళ్లరా’ అని పెద్దవాళ్లు కోరితే కాదనవద్దు. ఆ కోరిక లోతు మనకు తెలియదు. చెప్పినా అర్థం కాదు. చేయవలసిందల్లా కోరింది తీర్చడమే.కుటుంబాలు కలిపే సంస్థతాత మరణించాక లండన్‌లో స్థిరపడిన కరమ్‌జిత్‌కు... కఠినమైన వీసా నియమాల వల్ల పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సులువు కాలేదు. అయితే దేశ విభజన సమయంలో విడిపోయిన పంజాబీ కుటుంబాలను తిరిగి కలిపేందుకు ‘జీవే సంఝా పంజాబ్’ పేరుతో ఒక సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రయత్నంతో వాఘా బోర్డర్ మీదుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టేందుకు కరమ్‌జిత్ కౌర్‌కు అనుమతి లభించింది. ‘నేను పాకిస్తాన్‌కు వెళుతున్నానని తెలిసి మా చిన్నతాత కుమారుడు తనని కూడా తీసుకెళ్లమని ఎంతో ఏడ్చారు. కాని ఆయన వయసు రీత్యా వీల్‌చైర్‌లో ఉన్నారు. నీ కోసం మన ఊరి మట్టి తీసుకొస్తానులే పెదనాన్నా అని చెప్పి వచ్చాను’ అంటుందామె భావోద్వేగంతో.