karimnagar corportation
-
పంచాయితీలు కార్పోరేషన్లో విలీనం
సాక్షి, అల్గునూర్: కరీంనగర్ కార్పొరేషన్ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్ కార్పొరేషన్ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటుచేశారు. హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు స్వాధీనం.. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ భవనాలకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పాలన ప్రారంభం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, మానకొండూర్ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్ పాలన మొదలైంది. పన్నులు పెరగవు.. గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్‌కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను డీసీఎంఏకు రాసి ఆన్లైన్ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్‌లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
అక్రమ నల్లాలపై దృష్టేది?
హడావిడి చేసి అటకెక్కించిన అధికారులు విచ్చిలవిడిగా అక్రమ కనెక్షన్లు ఆదాయమార్గాల పెంపుపై అశ్రద్ధ తూతూమంత్రంగా తనిఖీలు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ కార్పొరేషన్లో అక్రమ నల్లాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక డ్రై వ్ అటకెక్కింది. ఏడాది క్రితం ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ అమల్లోకి వచ్చినప్పుడు అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించుకోవాలని పాలకవర్గం, అధికారులు కోరారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా ఇంటింటికీ సర్వే చేపట్టారు. రిజిస్టర్ ప్రకారం ఎన్ని నల్లాలు ఉన్నాయి..క్షేత్రస్థాయిలో ఎన్ని ఉన్నాయనే వివరాలు సేకరించాల్సిందిగా ప్రై వేట్ సిబ్బందికి పురమాయించారు. డీఈ స్థాయిలో కమిటీ వేసి నల్లా కనెక్షన్లపై విచారణ చేపట్టేందుకు సిద్ధపడ్డారు. కొద్ది రోజులు హడావిడి చేసి అటకెక్కించారు. ఆదాయమార్గాలపై అశ్రద్ధ నీటిసరఫరా విభాగంలో ఆదాయం పెంపుపై అశ్రద్ధ కనిపిస్తుంది. డిమాండ్‌కు మించిన నీటి సరఫరా జరుగుతున్న ఆదాయం రావడం లేదు. మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వం ఓ వైపు ప్రకటిస్తుంటే నగరపాలక అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నల్లాలను క్రమబద్ధీకరిస్తే కనీసం నల్లా ద్వారా ప్రతి నెల రూ.100 ఆదాయం సమకూరుతుంది. నీటి వృథాను అరికట్టేందుకు అక్రమ నల్లాలకు చెక్ పెట్టే చర్యలు కనిపించడం లేదు. అక్రమాలను అడ్డుకోవాల్సిన సిబ్బందే చేతివాటంతో మున్సిపల్ ఆదాయానికి గండిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమమే అధికం నగరంలోని 50 డివిజన్లలో 40 వేల నల్లా కనెక్షన్లు అధికారికంగా ఉంటే మరో 10 వేల వరకు అనధికార కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. రోజురోజుకు నీటి సరఫరా జఠిలమవడం, డిమాండ్‌కు మించి నీటి సరఫరా చేసిన కొన్ని డివిజన్లకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతి రోజు 27 ఎంఎల్డీల నీటి సరఫరా చేసినప్పటికీ చాలా ప్రాంతాల్లో తాగునీరు రావడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. గంటపాటు నీటి సరఫరా జరిగినా నాలుగు బిందెల నీళ్లు రాకపోవడంతో ప్రజలు కార్పొరేషన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. దొంగ నల్లాలు పెట్టుకున్న వారు, డైరెక్ట్‌గా ప్రధాన లైన్లకే కనెక్షన్ తీసుకున్న వారు నీటిని డ్రెయినేజీల్లోకి వృథాగా వదులుతుండడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి నల్లాలను తొలగించకపోతే భవిష్యత్‌లో ఎంత నీటి సరఫరా చేసినా పైపులైన్ చివరన ఉన్న వారికి చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ఇంటింటికి నల్లా నగరంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. బీపీఎల్ కింద అడిగిన వెంటనే ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పినా, దొంగ నల్లాలు వాడుకుంటున్న వారు స్పందించడం లేదు. క్రమబద్ధీకరించుకుంటే నెలకు రూ.100 బిల్లు చెల్లించాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు. వీరికి సిబ్బంది సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. పబ్లిక్ నల్లాలు సైతం నగరంలో 600 పైచిలుకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నల్లాల ద్వారా ఉపయోగం కంటే, నీటి వృథానే ఎక్కువవుతోంది. అయితే పబ్లిక్ నల్లాలు ప్రాంతంలో ఇళ్లలోకి నల్లాలు తీసుకునేందుకు ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో పబ్లిక్ నల్లాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అక్రమాలు అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికైనా అక్రమ నల్లాలపై దృÙ్టపెట్టాల్సిన అవసరం ఉంది. -
పెరుగుతున్న వ్యయం
ఆదాయ వనరులపై అశ్రద్ధ అంచనా బడ్జెట్ రూ.280 కోట్లు ఆదాయం రూ.40 కోట్లు గ్రాంట్లు, ప్రత్యేక నిధులతోనే అభివృద్ధి కరీంనగర్ కార్పొరేషన్ : ఆదాయాన్ని మించిన వ్యయంతో కార్పొరేషన్లో వింత పరిస్థితి ఉంది. అభివద్ధి పనులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, నిధులే ఆధారం. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించడం ఎప్పుడో నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.100కోట్ల చొప్పున కేటాయించడంతో ఆశలు చిగురించాయి. అమత్కు ఎంపికవడంతో ఏటా రూ.25కోట్లు వచ్చే అవకాశం ఉంది. నిధులు పుష్కలంగా వస్తాయనే ఉద్దేశంతో రూ.280కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించారు. అయితే ఆదాయాన్ని మరిచిపోయారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆదాయ వనరులపై అశ్రద్ధ కనిపిస్తుంది. బల్దియా ఆదాయాన్ని పెంచుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లపై ఆధారపడి అభివద్ధి పనులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించడం, అమృత్ నిధులు రూ.25కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూ.16.2 కోట్లను పరిగణలోకి తీసుకుని రూ.280 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. కానీ బల్దియా ఆదాయం రూ.40 కోట్లకు మించి లేదనే విషయాన్ని మరిచారు. నల్లాల ద్వారా రూ.4.8 కోట్లు నగరంలో నల్లాల సంఖ్య 40,500కు చేరుకుంది. నల్లా కనెక్షన్ల ద్వారా ఏడాదికి రూ.4.8 కోట్లు ఆదాయం సమకూరుతోంది. విద్యుత్ చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, నీటిశుద్ధికి కావాల్సిన ఆలం, క్లోరినైజేషన్ కొనుగోలు, మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏటా సుమారు రూ.6 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్రమ నల్లా కనెక్షన్లు వేల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హోర్డింగ్‌లపై శ్రద్ధేది? నగరంలో హోర్డింగ్‌లపై పట్టింపు కరువైంది. ప్రస్తుతం రూ.2కోట్లు వస్తున్న హోర్డింగ్‌ల ద్వారా కనీసం రూ.50 కోట్లు కూడా రాబట్టవచ్చని అధికారుల అభిప్రాయం. ఈ విషయంపై కమిషనర్, మేయర్ సైతం పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. అయినా వాటికి ఖచ్చితమైన లెక్కలు ఇప్పటికీ చేయకపోవడం విచారకరం. ఖాళీ స్థలాలపై వీఎల్టీ వేయాల్సి ఉంది. లైసెన్స్ ఫీజుల్లో చేతివాటం నగరపాలకసంస్థలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు గందరగోళంగా మారాయి. ట్రేడ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా వసూల్లు చేస్తున్నారు. రూ.కోటి వరకు వసూలు చేయాల్సి ఉండగా రూ.50 లక్షలు కూడా రావడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో 5 వేల దుకాణాలు ఉన్నట్లు గుర్తించారు. అద్దెలపై అశ్రద్ధ నగరపాలకసంస్థలోని దుకాణాలను వేలం వేయడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఏటా రూ.3.5కోట్ల ఆదాయం రావాలి. కానీ దుకాణాలు ఖాళీగా ఉండడంతో అది రూ.2 కోట్లకే పరిమితమైంది. వీటి గురించి మూడేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆస్తి పన్నులే ప్రధానాధారం నగరపాలక సంస్థలో ఆస్తి పన్నుల రూపంలో రూ.16.5 కోట్లు ఆదాయం వస్తుంది. ఆస్తి పన్నుల విషయంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఏటా 97 శాతానికిపైగా వసూలు చేస్తున్నారు. ఆస్తిపన్నులే బల్దియాకు ఆధారంగా మారుతున్నాయి. పెరుగుతున్న వ్యయం నగరపాలక సంస్థకు విద్యుత్ బిల్లులు, శానిటేషన్ కార్మికుల వేతనాలు గుదిబండగా మారుతున్నాయి. విద్యుత్ బిల్లులకు రూ.6 కోట్లు, శానిటేషన్ కార్మికులకు ఏటా రూ.10.5 కోట్లు, సాధారణ పాలన వ్యవహారాలకు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు, గ్రాంట్లే ఆధారం నగరపాలక సంస్థలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడంతో ప్రభుత్వ నిధులు, గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆదారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.100 కోట్లు, అమత్ నిధులు రూ.25 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16.2 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.