అక్రమ నల్లాలపై దృష్టేది?
-
హడావిడి చేసి అటకెక్కించిన అధికారులు
-
విచ్చిలవిడిగా అక్రమ కనెక్షన్లు
-
ఆదాయమార్గాల పెంపుపై అశ్రద్ధ
-
తూతూమంత్రంగా తనిఖీలు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ కార్పొరేషన్‌లో అక్రమ నల్లాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక డ్రై వ్ అటకెక్కింది. ఏడాది క్రితం ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ అమల్లోకి వచ్చినప్పుడు అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించుకోవాలని పాలకవర్గం, అధికారులు కోరారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా ఇంటింటికీ సర్వే చేపట్టారు. రిజిస్టర్ ప్రకారం ఎన్ని నల్లాలు ఉన్నాయి..క్షేత్రస్థాయిలో ఎన్ని ఉన్నాయనే వివరాలు సేకరించాల్సిందిగా ప్రై వేట్ సిబ్బందికి పురమాయించారు. డీఈ స్థాయిలో కమిటీ వేసి నల్లా కనెక్షన్లపై విచారణ చేపట్టేందుకు సిద్ధపడ్డారు. కొద్ది రోజులు హడావిడి చేసి అటకెక్కించారు.
ఆదాయమార్గాలపై అశ్రద్ధ
నీటిసరఫరా విభాగంలో ఆదాయం పెంపుపై అశ్రద్ధ కనిపిస్తుంది. డిమాండ్‌కు మించిన నీటి సరఫరా జరుగుతున్న ఆదాయం రావడం లేదు. మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వం ఓ వైపు ప్రకటిస్తుంటే నగరపాలక అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నల్లాలను క్రమబద్ధీకరిస్తే కనీసం నల్లా ద్వారా ప్రతి నెల రూ.100 ఆదాయం సమకూరుతుంది. నీటి వృథాను అరికట్టేందుకు అక్రమ నల్లాలకు చెక్ పెట్టే చర్యలు కనిపించడం లేదు. అక్రమాలను అడ్డుకోవాల్సిన సిబ్బందే చేతివాటంతో మున్సిపల్ ఆదాయానికి గండిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమమే అధికం
నగరంలోని 50 డివిజన్లలో 40 వేల నల్లా కనెక్షన్లు అధికారికంగా ఉంటే మరో 10 వేల వరకు అనధికార కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. రోజురోజుకు నీటి సరఫరా జఠిలమవడం, డిమాండ్‌కు మించి నీటి సరఫరా చేసిన కొన్ని డివిజన్లకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతి రోజు 27 ఎంఎల్‌డీల నీటి సరఫరా చేసినప్పటికీ చాలా ప్రాంతాల్లో తాగునీరు రావడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. గంటపాటు నీటి సరఫరా జరిగినా నాలుగు బిందెల నీళ్లు రాకపోవడంతో ప్రజలు కార్పొరేషన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. దొంగ నల్లాలు పెట్టుకున్న వారు, డైరెక్ట్‌గా ప్రధాన లైన్లకే కనెక్షన్ తీసుకున్న వారు నీటిని డ్రెయినేజీల్లోకి వృథాగా వదులుతుండడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి నల్లాలను తొలగించకపోతే భవిష్యత్‌లో ఎంత నీటి సరఫరా చేసినా పైపులైన్ చివరన ఉన్న వారికి చుక్క నీరు వచ్చే అవకాశం లేదు.
ఇంటింటికి నల్లా
నగరంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. బీపీఎల్ కింద అడిగిన వెంటనే ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పినా, దొంగ నల్లాలు వాడుకుంటున్న వారు స్పందించడం లేదు. క్రమబద్ధీకరించుకుంటే నెలకు రూ.100 బిల్లు చెల్లించాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు. వీరికి సిబ్బంది సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. పబ్లిక్ నల్లాలు సైతం నగరంలో 600 పైచిలుకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నల్లాల ద్వారా ఉపయోగం కంటే, నీటి వృథానే ఎక్కువవుతోంది. అయితే పబ్లిక్ నల్లాలు ప్రాంతంలో ఇళ్లలోకి నల్లాలు తీసుకునేందుకు ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో పబ్లిక్ నల్లాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అక్రమాలు అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికైనా అక్రమ నల్లాలపై దృÙ్టపెట్టాల్సిన అవసరం ఉంది.