-
ఆదాయ వనరులపై అశ్రద్ధ
-
అంచనా బడ్జెట్ రూ.280 కోట్లు
-
ఆదాయం రూ.40 కోట్లు
-
గ్రాంట్లు, ప్రత్యేక నిధులతోనే అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్ : ఆదాయాన్ని మించిన వ్యయంతో కార్పొరేషన్‌లో వింత పరిస్థితి ఉంది. అభివద్ధి పనులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, నిధులే ఆధారం. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించడం ఎప్పుడో నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.100కోట్ల చొప్పున కేటాయించడంతో ఆశలు చిగురించాయి. అమత్‌కు ఎంపికవడంతో ఏటా రూ.25కోట్లు వచ్చే అవకాశం ఉంది. నిధులు పుష్కలంగా వస్తాయనే ఉద్దేశంతో రూ.280కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించారు. అయితే ఆదాయాన్ని మరిచిపోయారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆదాయ వనరులపై అశ్రద్ధ కనిపిస్తుంది. బల్దియా ఆదాయాన్ని పెంచుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లపై ఆధారపడి అభివద్ధి పనులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించడం, అమృత్ నిధులు రూ.25కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూ.16.2 కోట్లను పరిగణలోకి తీసుకుని రూ.280 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. కానీ బల్దియా ఆదాయం రూ.40 కోట్లకు మించి లేదనే విషయాన్ని మరిచారు.
నల్లాల ద్వారా రూ.4.8 కోట్లు
నగరంలో నల్లాల సంఖ్య 40,500కు చేరుకుంది. నల్లా కనెక్షన్‌ల ద్వారా ఏడాదికి రూ.4.8 కోట్లు ఆదాయం సమకూరుతోంది. విద్యుత్ చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, నీటిశుద్ధికి కావాల్సిన ఆలం, క్లోరినైజేషన్ కొనుగోలు, మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏటా సుమారు రూ.6 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్రమ నల్లా కనెక్షన్లు వేల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హోర్డింగ్‌లపై శ్రద్ధేది?
నగరంలో హోర్డింగ్‌లపై పట్టింపు కరువైంది. ప్రస్తుతం రూ.2కోట్లు వస్తున్న హోర్డింగ్‌ల ద్వారా కనీసం రూ.50 కోట్లు కూడా రాబట్టవచ్చని అధికారుల అభిప్రాయం. ఈ విషయంపై కమిషనర్, మేయర్ సైతం పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. అయినా వాటికి ఖచ్చితమైన లెక్కలు ఇప్పటికీ చేయకపోవడం విచారకరం. ఖాళీ స్థలాలపై వీఎల్‌టీ వేయాల్సి ఉంది.
లైసెన్స్ ఫీజుల్లో చేతివాటం
నగరపాలకసంస్థలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు గందరగోళంగా మారాయి. ట్రేడ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా వసూల్లు చేస్తున్నారు. రూ.కోటి వరకు వసూలు చేయాల్సి ఉండగా రూ.50 లక్షలు కూడా రావడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో 5 వేల దుకాణాలు ఉన్నట్లు గుర్తించారు.
అద్దెలపై అశ్రద్ధ
నగరపాలకసంస్థలోని దుకాణాలను వేలం వేయడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఏటా రూ.3.5కోట్ల ఆదాయం రావాలి. కానీ దుకాణాలు ఖాళీగా ఉండడంతో అది రూ.2 కోట్లకే పరిమితమైంది. వీటి గురించి మూడేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆస్తి పన్నులే ప్రధానాధారం
నగరపాలక సంస్థలో ఆస్తి పన్నుల రూపంలో రూ.16.5 కోట్లు ఆదాయం వస్తుంది. ఆస్తి పన్నుల విషయంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఏటా 97 శాతానికిపైగా వసూలు చేస్తున్నారు. ఆస్తిపన్నులే బల్దియాకు ఆధారంగా మారుతున్నాయి.
పెరుగుతున్న వ్యయం
నగరపాలక సంస్థకు విద్యుత్ బిల్లులు, శానిటేషన్ కార్మికుల వేతనాలు గుదిబండగా మారుతున్నాయి. విద్యుత్ బిల్లులకు రూ.6 కోట్లు, శానిటేషన్ కార్మికులకు ఏటా రూ.10.5 కోట్లు, సాధారణ పాలన వ్యవహారాలకు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ప్రభుత్వ నిధులు, గ్రాంట్లే ఆధారం
నగరపాలక సంస్థలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడంతో ప్రభుత్వ నిధులు, గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆదారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రూ.100 కోట్లు, అమత్ నిధులు రూ.25 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16.2 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.