అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం
వేరుశనగ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది అనంత. కానీ ఇప్పుడు నాణ్యమైన అరటితోనూ అనంత గుర్తింపు తెచ్చుకుంది. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇప్పటికే గల్ఫ్ లాంటి విదేశాలకు ఎగుమతి అవుతున్న ‘అనంత’ అరటి.. సమీప భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ కానుంది.
సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) అనంతపురం జిల్లాను బనానా డెవలప్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాల్లో ఉద్యాన తోటలపై సర్వే నిర్వహించిన ఎన్‌హెచ్‌బీ... కొన్ని ప్రామాణికాల ఆధారంగా 12 జిల్లాల పరిధిలో 7 ఉద్యాన పంటలను గుర్తించింది. అందులో అరటికి సంబంధించి తమిళనాడులోని థేనీ జిల్లాతో పాటు ‘అనంత’కు స్థానం కల్పించడం విశేషం. మిగతా వాటి విషయానికి వస్తే... యాపిల్ క్లస్టర్లుగా షోపియాన్ (జమ్మూకాశ్మీర్), కిన్నౌర్ (హిమాచలప్రదేశ్), మామిడి క్లస్టర్లుగా లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్), మహబూబ్‌నగర్ జిల్లా (తెలంగాణా) ఉన్నాయి. అలాగే ద్రాక్ష క్లస్టర్‌గా నాసిక్ (మహారాష్ట్ర), ఫైనాపిల్ క్లస్టర్‌గా సిఫాహిజలా (త్రిపుర), దానిమ్మ క్లస్టర్లుగా షోలాపూర్ (మహారాష్ట్ర), చిత్రదుర్గ (కర్ణాటక) ఉండగా పసుపు క్లస్టర్‌గా పశ్చిమ జైంతియాహిల్స్ (మేఘాలయ)ను ప్రకటించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన
తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ శుక్రవారం నార్పల మండలం కర్ణపుడికి గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. రైతుల సమస్యలు, అనుభవాలు తెలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ తదితరులు ఉన్నారు. అరటి దిగుబడి, లభిస్తున్న ధర, ఎగుమతులు, సాగు పద్ధతులను తెలుసుకున్నారు.
నార్పల మండం కర్ణపుడికిలో అరటి తోట పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న అభిలాక్ష్ లిఖీ
అరటి రైతులకు మూడింతల ఆదాయం
మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు రైతులకు మూడింతల ఆదాయం వచ్చేలా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.270 కోట్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ తెలిపినట్లు ఉద్యానశాఖ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. అందులో ఉత్పత్తి పెంపునకు రూ.116.50 కోట్లు, పంట కోతల తర్వాత యాజమాన్యం, విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం రూ.74.75 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా వసతుల కోసం రూ.78.70 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
అరటి తోటలు ఎక్కువగా ఉన్న నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి తదితర ప్రాంతాల్లో నాణ్యమైన దిగుబడులు, మార్కెటింగ్ వ్యవస్థ కల్పించడానికి రైపనింగ్ ఛాంబర్లు, కోల్ట్‌స్టోరేజీలు, ఎగుమతుల పెంపు కోసం ఇతరత్రా మౌలిక సదుపాయం కల్పించే అవకాశం మెండుగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా అరటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. దీంతో భవిష్యత్తులో అరటికి కేరాఫ్‌గా ‘అనంత’ మారుతుందని అంచనా వేస్తున్నారు.
క్లస్టర్ ప్రకటనతో ఎన్‌హెచ్‌బీ అధ్యయనం
అనంతను అరటి క్లస్టర్‌గా ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ)కి చెందిన ఇరువురు అధికారులు బృందం గతేడాది రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించింది. అరటి తోటల సాగు, రైతుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూమి లక్షణాలు, రైతులు అవలంభిస్తున్న యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్, లభిస్తున్న ధర, నికర ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.