యువ ఐఏఎస్ మరణంతో.. ఆందోళనలు
కోలార్: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి అక్రమార్కులపై కొరడా ఝుళిపించిన కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి డీకే రవి మరణంపట్ల అక్కడి ప్రజలు ఆందోళనలు లేవనెత్తారు. ఆయన అనుమానాస్పద మృతి వెనుక పెద్ద కారణం ఉండి ఉంటుందని, స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. బంద్‌ను కూడా నిర్వహించారు. పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు. ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్, ట్యాక్స్ అక్రమార్కుల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా దర్యాప్తును ముందుకు తీసుకు వెళ్లారు.
వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆయన ప్రస్తుతం ట్యాక్స్ అధికారిగా పనిచేస్తుండగా ఇటీవల బెదిరింపు ఫోన్లు ఎక్కువవుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆయన మరణం అనంతరం పెద్ద సంఖ్యలో గుమిగూడిన పౌరులు రవికి ఘన నివాళి అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే కోలార్ వార్దుర్ ప్రకాశ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. రహదారిపై టైర్లు తగులబెట్టారు. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.