క్షమాపణలు చెప్పిన గౌతమ్ మీనన్
సాక్షి, చెన్నై : యువ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ఏర్పడ్డ వివాదానికి ఎట్టకేలకు సీనియర్ దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ పుల్‌స్టాప్ పెట్టారు. ఈ మేరకు కార్తీక్‌కు క్షమాపణలు తెలియజేస్తూ ఆయన ఫేస్బుక్లో ఓ లేఖను ఉంచారు.
డెబ్యూ చిత్రం ధురువంగల్ పతినారు(తెలుగులో 16)తో కార్తీక్ నరెన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తన రెండో చిత్రం నరగాసూరన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. దానికి నిర్మాతగా వ్యవహరించేందుకు గౌతమ్ మీనన్ ముందుకొచ్చాడు. దీంతో సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. అరవింద్ స్వామి, శ్రీయా, సందీప్ కిషన్, ఇంద్రజిత్ తదితరులతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే సినిమా 50 శాతం పూర్తయ్యాక అర్థాంతరంగా గౌతమ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో చేసేది లేక సొంత డబ్బులతో కార్తీక్ సినిమా కొనసాగించాడు.
ట్వీట్లతో మొదలు... గౌతమ్ మీనన్‌పై తాను పెట్టుకున్న నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసి మోసం చేశాడని కార్తీక్ ట్వీట్ చేశాడు. తన కలను ఘోరంగా దెబ్బతీశాడని.. తాను ఇబ్బందులను ఎదుర్కుంటున్నానని, ఇలా పారిపోవటం కరెక్ట్కాదంటూ కార్తీక్.. గౌతమ్‌కు చురకలు అంటించాడు. దానికి బదులుగా గౌతమ్ కూడా తీవ్రస్థాయిలోనే స్పందించాడు. అయితే తనపై ఏడ్చే బదులు యంగ్ టాలెంట్‌ను చూసి బుద్ధితెచ్చుకోండంటూ వెటకారంగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
గౌతమ్ క్షమాపణలు... ఈ వివాదం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వెనక్కితగ్గిన గౌతమ్ మీనన్ కార్తీక్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు ఫేస్బుక్లో ఓ లెటర్‌ను పోస్ట్ చేశాడు. ‘మీడియా నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌తో మనోవేదనకు గురయ్యా. అందుకే అలాంటి ట్వీట్ చేశాను. కార్తీక్‌కు నా క్షమాపణలు. ఈ చిత్రం కోసం ఇప్పటికే చాలా ఖర్చు అయ్యింది. నా తర్వాతి ప్రాజెక్టు ధ్రువ నక్షత్రం(విక్రమ్ హీరోగా తీస్తున్న చిత్రం) వ్యవహారంలో ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయాను. అందుకే నరగాసురన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టు 50 శాతం పూర్తయ్యేదాకా నా టీం ఖర్చులను భరించింది. కానీ, ఇకపై నాకు చిత్రంతో సంబంధం లేదని ప్రకటిస్తున్నా. కాబట్టి చిత్ర లాభాల్లో కూడా నాకు ఎలాంటి వాటా ఇవ్వనక్కర్లేదు’ అని గౌతమ్ మీనన్ స్పష్టత ఇచ్చేశారు.