పవన్ రాకతో పోటెత్తిన అభిమానులు
ఖమ్మం క్రైం: విషమ పరిస్థితిలో ఉన్న తన చిన్నారి అభిమానిని పరామర్శించేందుకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నగరానికి వచ్చారు. ఎన్ఎస్టీ రోడ్డులో గల కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండి శ్రీజ(12)ను ఆయన పరామర్శించారు. పవన్ కల్యాణ్ వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి వద్ద పోలీసులు గురువారం అర్ధరాత్రి నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తోపులాట
పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వచ్చిన అభిమానులతో ఆస్పత్రి పరిసరాలు కిటకిటలాడాయి. వారిని అదుపుచేయలేక పో లీసులు నానా అవస్థలు పడ్డారు. అభిమానులకు, పోలీసులకు మధ్య పలుమార్లు తోపులాట జరిగిం ది. పోలీసుల రోప్ పార్టీని పవన్ అభిమానులు నెట్టివేసి ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆస్పత్రిలోకి పవన్ కల్యాణ్ వెళ్లేముందు, బయటకు వచ్చేప్పుడు ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అభిమానుల తాకిడి, తోపులాటతో ఆస్పత్రి వెనుకవైపునగల గోడ కూలడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
రోగులకు ఇక్కట్లు
పవన్ కల్యాణ్ రాక సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, అభిమానులు పోటెత్తడంతో కార్తీక్ సూపర్ స్పెషాలిటీకి వచ్చిన రోగులు లోపలికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. లోపలికి వెళ్లేందుకు వారిని పోలీసులు అనుమతించలేదు. పవన్, చిరంజీవి అభిమాన సంఘ నాయకులను కూడా పోలీసులు ఆస్పత్రిలోకి వెళ్లనీయలేదు. మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో, ఆయన మాట్లాడింది ఎవరికీ అర్థం కాలేదు. ఆయన నిముషం లోపే మాట్లాడి వెళ్లిపోయారు.