Karurvysya Bank
-
రైతు కష్టార్జితం..బ్యాంకు పాలు!
సాక్షి, కర్నూలు : ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరెడ్డి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామం. 2016 రబీలో పండించిన శనగలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 110 క్వింటాళ్లకు పైగా (178 బస్తాలు) దిగుబడిని అదే గ్రామంలోని జై కిసాన్ గోదాములో నిల్వ చేశాడు. ఈ శనగలపై కర్నూలు వెంకటరమణ కాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖ నుంచి 2017 ఏప్రిల్ 4న రూ.4.29 లక్షలు రుణం తీసుకున్నాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో అవి గోదాములోనే ఉండిపోయాయి. అప్పు కట్టలేదని రైతుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు లారీతో వచ్చి శనగ బస్తాలను ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లవద్దని వెంకటేశ్వరరెడ్డి ప్రాధేయపడినా వారు వినుకోలేదు. గోదాముల్లోని రైతుల శనగలను తరలించడం, వేలం వేయడం చేయరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది వరకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అయినా, కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు దౌర్జన్యంగా శనగలు ఎత్తుకెళ్లడంతో బాధిత రైతు సోమవారం కలెక్టర్ జి.వీరపాండియన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఎల్డీఎంను పిలిచి సదరు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ...
శ్రీకాకుళం: రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో కరూర్వైశ్యాబ్యాంకులో అప్రజైర్ (బంగారు ఆభరణాల పరిశీలకుడు) గా విధులు నిర్వహిస్తున్న ఘరానామోసగాడు బ్యాంకుకే కన్నం పెట్టాడు. నకిలీ బంగారు ఆభరణాలను ఒరిజినల్ బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ. 1,33,55,000 లను కొల్లగొట్టాడు. 40మంది ఖాతాదారులతో ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చివరికి అనూహ్యంగా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.... రాజాంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో గత ఏడాదిన్నర నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా అందించారు. ఇటీవల బ్రాంచి మేనేజర్ చంద్రమౌళిరెడ్డి బంగారు ఆభరణాలపై రుణాలు పొంది గడువు ముగిసిన లబ్దిదారులకు నోటీసులు పంపించాడు. ఎటువంటి స్పందన రాకపోవడంతో బ్రాంచి మేనేజర్ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు క్రితం బ్యాంకుకు చేరుకొని వేలంవేసే ఆభరణాలపై ఆరా తీశారు. వాటిని పరిశీలించగా నకిలీ ఆభరణాలుగా గుర్తించడంతో మొత్తం ఆభరణాలపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయపడింది. సమాచారం తెలుసుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకొని ఆరా తీశారు. మేనేజర్ వద్ద ఫిర్యాదులు సేకరించిన అనంతరం అప్రైజర్ను విచారించారు. అప్రైజర్ను పోలీసు స్టేషన్కు తరలించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన వివరాలు ప్రకారం ఖాతాదారులను వివరించనున్నట్లు తెలిపారు.