సాక్షి, కర్నూలు : ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరెడ్డి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామం. 2016 రబీలో పండించిన శనగలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 110 క్వింటాళ్లకు పైగా (178 బస్తాలు) దిగుబడిని అదే గ్రామంలోని జై కిసాన్ గోదాములో నిల్వ చేశాడు. ఈ శనగలపై కర్నూలు వెంకటరమణ కాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖ నుంచి 2017 ఏప్రిల్ 4న రూ.4.29 లక్షలు రుణం తీసుకున్నాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో అవి గోదాములోనే ఉండిపోయాయి.
అప్పు కట్టలేదని రైతుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు లారీతో వచ్చి శనగ బస్తాలను ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లవద్దని వెంకటేశ్వరరెడ్డి ప్రాధేయపడినా వారు వినుకోలేదు. గోదాముల్లోని రైతుల శనగలను తరలించడం, వేలం వేయడం చేయరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇది వరకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అయినా, కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు దౌర్జన్యంగా శనగలు ఎత్తుకెళ్లడంతో బాధిత రైతు సోమవారం కలెక్టర్ జి.వీరపాండియన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఎల్‌డీఎంను పిలిచి సదరు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment