kodumuru.
-
రైతు కష్టార్జితం..బ్యాంకు పాలు!
సాక్షి, కర్నూలు : ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరెడ్డి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామం. 2016 రబీలో పండించిన శనగలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 110 క్వింటాళ్లకు పైగా (178 బస్తాలు) దిగుబడిని అదే గ్రామంలోని జై కిసాన్ గోదాములో నిల్వ చేశాడు. ఈ శనగలపై కర్నూలు వెంకటరమణ కాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖ నుంచి 2017 ఏప్రిల్ 4న రూ.4.29 లక్షలు రుణం తీసుకున్నాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో అవి గోదాములోనే ఉండిపోయాయి. అప్పు కట్టలేదని రైతుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు లారీతో వచ్చి శనగ బస్తాలను ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లవద్దని వెంకటేశ్వరరెడ్డి ప్రాధేయపడినా వారు వినుకోలేదు. గోదాముల్లోని రైతుల శనగలను తరలించడం, వేలం వేయడం చేయరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది వరకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అయినా, కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు దౌర్జన్యంగా శనగలు ఎత్తుకెళ్లడంతో బాధిత రైతు సోమవారం కలెక్టర్ జి.వీరపాండియన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఎల్డీఎంను పిలిచి సదరు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎమ్మెల్యే మణిగాంధిపై విరుచుకుపడ్డ జనం
బురాన్‌దొడ్డి(సి.బెళగల్) : ‘‘అయ్యా మేము నాలుగేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వడం లేదు. మేము సచ్చాక పింఛన్ ఇవ్వాలనుకున్నారా..?’’ అంటూ వృద్ధులు ఎమ్మెల్యే మణిగాంధీని, అధికారులను నిలదీశారు. బుధవారం మండల పరిధిలోని బురాన్‌దొడ్డిలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ నోడల్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనెనాయక్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ సిద్ధాలింగమూర్తి, తహసీల్దార్ అన్వర్‌హుసేన్, ఆర్అండ్బీ ఏఈ ఫణీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులు గంగన్న, జాన్, వితంతువులు వరలక్ష్మి, సువర్ణ, మైబూబాబీ, గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో తాగడానికే నీళ్లు లేవని గ్రామస్తులు దేవరాజు, మాదన్న, ఆనంద్ తదితరులు అధికారులను నిలదీశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీలకు శ్మశానానికి స్థలం కేటాయించాలని చంద్రన్న, సుంకన్నలు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమనెమ్మ, అధికారులు పాల్గొన్నారు. -
మట్కా ఓపెన్..బతుకులు క్లోజ్
పోలీస్‌స్టేషన్ మామూళ్లు నెలకు రూ.50వేలు.. కానిస్టేబులే మట్కాకు బానిసైన వైనం జూదం పేరుతో రోజూ రూ.3 లక్షలు వసూలు చేస్తున్న బీటర్లు కోడుమూరులో కర్నూలు మట్కాకింగ్ బంధువులదే కీలకం! మట్కా నెంబర్ తగిలితే రూ. 1కి రూ.80 ఇస్తాం. ఇది కోడుమూరు మండలంలో మట్కాబీటర్ల ఆఫర్. కోడుమూరు మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ ఆటకు అమాయక జనం బానిసై ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడుతున్నారు. ఈ మాయజూదానికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నెలమాముళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కోడుమూరు:కోడుమూరు పట్టణంలోని నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ యువకుడు మట్కాకు బానిసై రూ.4లక్షలు అప్పులు చేసి భార్యాపిల్లలను వదిలేసి ఊరు వదిలి పారిపోయాడు. తల్లిదండ్రులు అప్పులు కట్టి మళ్లీ పునరావాసం కల్పించారు. లద్దగిరిలో ఓ వ్యక్తి మట్కాకు బానిసై బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఇల్లు, ఆటో అమ్ముకొని బాడుగ ఇంట్లో నివాసముంటున్నాడు. ఇలా ఎంతోమంది మట్కాకు బానిసై అస్తులు పొగొట్టుకుంటున్నారు. మండలంలో వీధి వీధిన మట్కాబీటర్లు తిష్టవేసి ప్రజలకు డబ్బుఆశచూపి మాయజూదంలోకి లాగుతున్నారు. మట్కా నంబర్ తగిలితే రూపాయకు రూ.80లు ఇస్తామని మభ్యపెట్టి వారి నుంచి వేలకువేలు వసూలు చేస్తున్నారు. ఓపెన్, క్లోజింగ్ నంబర్ల పేరుతో వారంలో ఐదు రోజులు ఈ దందా సాగిస్తున్నారు. మండలంలో రోజుకు దాదాపు రూ.3లక్షలు వసూలవుతున్నట్లు సమాచారం. మట్కా బీటర్లు వీరే: కర్నూలు నగరంలో మట్కా కింగ్‌గా రాజ్యమేలుతున్న మట్కా బీటర్ సమీప బంధువులు కోడుమూరు పట్టణంలో పెద్ద ఎత్తున జూదం నడుపుతున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించరు. అత్యాధునికమైన నాలుగు భవంతులను ఆ మట్కా బీటర్ కోడుమూరులో నిర్మించాడు. గోరంట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్నూలు రేడియోస్టేషన్ దగ్గర మెడికల్‌షాపు వ్యాపారం ముసుగులో మట్కాను నడుపుతున్నాడు. కోడుమూరు, గోరంట్లలో మట్కా బీటర్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అల్లినగరంలో ఓ వ్యక్తి మట్కా బీటర్ అవతారమెత్తి రోజుకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాడు. గతంలో కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఆ వ్యక్తిపై మట్కా కేసులు నమోదయ్యాయి. మట్కా నంబర్ తగిలినా మోసమే : మట్కా నంబర్ తగిలిన రోజు జూదరికి డబ్బులివ్వకుండా బీటర్లు మోసం చేస్తున్నారు. మట్కా నంబర్ తగిలిన రోజు పోలీసుల దాడులు జరిగాయని బుకాయించి తప్పించుకుంటున్నారు. పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో డబ్బులు ప్రధాన మట్కా కేంద్రానికి పంపలేదని జూదరులను బెదిరిస్తున్నారు. ఇలా రెండు విధాలుగా మట్కా జూదరులు నష్టపోతున్నారు. బీటర్లు మాత్రం అస్తులు కూడబెట్టుకుంటున్నారు. మట్కాకు పోలీసుల అండ మట్కాపై ఫిర్యాదులొచ్చినా చిన్నా చితక మట్కా ఆడే వారిని పట్టుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పెద్ద ఎత్తున మట్కా నడిపేవారికి పోలీసులు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. లద్దగిరి గ్రామంలో 5మంది యువకులకు రూ.12 లక్షలు మట్కా తగిలిన విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వారందరిని పోలీస్ కస్టడీలో వారం రోజుల పాటు పెట్టుకొని వారి నుంచి రూ.5లక్షలు వసూలు చేసుకుని కేసు లేకుండా వదిలిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ మట్కా జూదానికి బానిసయ్యాడు. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రోజు వందలాది రూపాయలు మట్కా బీటర్లకు జూదం కోసం పంపుతున్నట్లు సమాచారం. మట్కాపై నిఘా పెట్టాము : మహేష్‌కుమార్, ఎస్ఐ మట్కాబీటర్లపై నిఘా పెట్టాము. 6నెలల క్రితం మట్కాపై ఒకటో రెండో కేసులు పెట్టాము. కర్నూలు ప్రధాన మట్కా బీటర్ బంధువులపై నిఘా ఉంచాం. ఆధారాలు దొరికితే అరెస్ట్ చేస్తాం. మట్కాను ప్రోత్సహించే వారిని వదిలే సమస్యే లేదు.