సునంద.. శశిథరూర్.. మధ్య ఓ మహిళ!
కేంద్ర మాజీమంత్రి శశి థరూర్.. ఆయన భార్య సునందా పుష్కర్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? వాళ్లిద్దరి మధ్య మూడో మహిళ ఎవరైనా ఉన్నారా? ఈ వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. కేటీ అనే ఓ మహిళ కారణంగానే దంపతులిద్దరూ గొడవ పడ్డారని థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ విచారణ సందర్భంగా పోలీసులకు వెల్లడించాడని సమాచారం. అయితే.. కేటీ ఎవరో, ఏమిటోనన్న విషయం మాత్రం ఇంతవరకు ఇంకా తెలియడంలేదు. కేటీ గురించి దుబాయ్‌లో సునంద, థరూర్ లిద్దరు గొడవపడ్డారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాక థరూర్‌తో కలిసి లోదీ ఎస్టేట్‌లోని తమ ఇంటికి వెళ్లేందుకు సునంద ఇష్టపడలేదు. కోపంతో థరూర్‌ను చెంపదెబ్బ కూడా కొట్టింది. అసిస్టెంట్ సునీల్ తక్రుని పిలిచి అతని కారులో హోటల్ లీలా ప్యాలెస్‌కు సునంద వెళ్లింది. కాసేపటికి థరూర్ కొన్ని ట్వీట్లు చేయడంతో వాటిని కాపీచేసింది. సునీల్ ఫోన్‌తో పాటు జాకడ్ అనే మరో వ్యక్తి ఫోన్ నుంచి కూడా సునంద ట్వీట్లు చేసింది. ఆ తర్వాత థరూర్‌కు ఫోన్ చేసి 'మీడియాకు అంతా చెప్పేశాను, మీ చాప్టర్ క్లోజ్' అంటూ చెప్పినట్టు పనివాడు నారాయణ్ పోలీసులకు తెలిపాడట.
సునంద మరణించిన అతి తక్కువ కాలానికే లీలా ప్యాలెస్ హోటల్ నుంచి వెళ్లిపోయిన ఓ ఉద్యోగిని.. అక్కడ ఇప్పటికీ పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను కూడా సునంద హత్యకేసులో విచారించనున్నారు. వాళ్లతో పాటు సంజయ్ దేవన్ అనే కుటుంబ స్నేహితుడు ఒకరిని కూడా పోలీసులు విచారిస్తారు. జనవరి 17వ తేదీ సాయంత్రం సునంద ఎంతకీ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో వెంటనే డాక్టర్లను పిలవాల్సిందిగా హోటల్ మేనేజర్‌కు చెప్పింది ఆయనే.
మరోవైపు.. ఐపీఎల్ మాఫియానే సునంద మృతికి కారణమని కూడా అంటున్నారు. సునంద మృతికి ముందు సునీల్ సాహెబ్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు వారింట్లో పనివాడు నారాయణ్ చెప్పడంతో అటువైపు పోలీసుల విచారణ మళ్లింది.