kashmir government
-
వేర్పాటువాదులపై కఠిన వైఖరి!
ప్రధాని నిర్ణయంతో సిద్ధమవుతున్న హోం శాఖ - పాస్‌పోర్టుల స్వాధీనం, భద్రత కుదింపు - కశ్మీర్ ప్రభుత్వ మెతక వైఖరిపై అసంతృప్తి న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యకు కనుచూపు మేరలో పరిష్కారం కానరాకపోవడంతో ఇక నుంచి దూకుడుగా వెళ్లాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంతవరకూ వేర్పాటువాదుల విషయంలో సంయమనం పాటించిన మోదీ సర్కారు కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించింది. వారి పాస్‌పోర్టుల్ని వెనక్కి తీసుకోవడం, భద్రత కుదింపు వంటివి అందులో కొన్ని.. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన అఖిలపక్ష బృంద ఎంపీలతో మాట్లాడేందుకు వేర్పాటువాదులు నిరాకరించడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తిగా ఉంది. కశ్మీర్లో పరిపాలన లోపాలున్నాయని భావిస్తున్న కేంద్రం... తక్షణం దానికి పరిష్కారం కనుగొనాలని యోచిస్తోంది. వేర్పాటువాదుల విషయంలో కశ్మీర్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని, ఇకపై కఠినవైఖరి తప్పదనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఈ నేపథ్యంలోనే వేర్పాటువాదుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలతో పాటు, బ్యాంకు ఖాతాల్ని నిశితంగా పరిశీలించనున్నారు. వారిపై పెండింగ్ కేసుల విచారణ పూర్తి చేయడంపై కూడా దృష్టిపెడతారు. కఠినవైఖరి అవలంబిస్తామన్న విషయం వేర్పాటువాదులకు తెలియచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న మోదీ నిర్ణయంతో కేంద్ర హోం శాఖ ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. రెండ్రోజుల పర్యటనపై మోదీకి వివరణ.. మరోవైపు కశ్మీర్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీకి హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. అఖిలపక్ష ప్రతినిధి బృందం రెండ్రోజుల పర్యటన వివరాల్ని గంట పాటు సాగిన భేటీలో ఇరువురు చర్చించారు. వియత్నాం, చైనా పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ప్రధాని భారత్ చేరుకోగా, కశ్మీర్ పర్యటన ముగియడంతో రాజ్‌నాథ్ కూడా సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. వేర్పాటువాద నేతల చర్యలు ప్రజాస్వామ్యం, మానవత్వం, కశ్మీరీయత్కు వ్యతిరేకమని, కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. కశ్మీర్లో పరిస్థితి మెరుగుపడాలని అఖిలపక్ష బృందం కలిసిన ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారన్నారు. కశ్మీర్లో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేత.. కశ్మీర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం ఆందోళనకారులు, భద్రతాదళాలకు మధ్య హింసలో ఒక యువకుడు మరణించాడు. దీంతో కశ్మీర్ ఆందోళనల మృతుల సంఖ్య 73కి పెరిగింది. ఆదివారం సొపోర్ అల్లర్లలో గాయపడ్డ ముజబ్ నగూ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. మరోవైపు పరిస్థితి మెరుగుపడడంతో శ్రీనగర్ మొత్తం కర్ఫ్యూ ఎత్తివేసినా... వేర్పాటువాదుల బంద్ పిలుపుతో సాధారణ జనజీవనం మాత్రం మెరుగుపడలేదు. దీంతో రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేసినట్లయింది. సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలు.. వాస్తవాధీన రేఖ వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. సోమవారం అర్థరాత్రి నుంచి పూంచ్ సెక్టార్లో ఎలాంటి కవ్వింపు లేకండా పాక్ ఆర్మీ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
కశ్మీర్ సర్కారు ఏర్పాటు వేగవంతం
కొన్ని అంశాల అమలుకు సమయం కోరాం: రాంమాధవ్ న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి అతిత్వరలో తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి. భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరు పార్టీలు సుముఖంగా ఉండడంతో పాటు సంయుక్త కార్యాచరణను నిర్ధిష్ట కాలపరిమితితో అమలుకు బీజేపీ సిద్ధమవడంతో చర్చలు పట్టాలెక్కాయి. సంక్షోభ నివారణకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబాతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ బుధవారం చర్చలు జరిపారు. గతంలో ఇరు పార్టీలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకే భాగస్వామ్య ప్రభుత్వం కొనసాగుతుందని రాంమాధవ్ చెప్పారు. గత ఏర్పాట్ల మేరకే ప్రభుత్వాన్ని ఇవ్వగలమని, సంయుక్త ఎజెండా అమలుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎజెండా అమలులో జాప్యం ఉండదని, కొత్తవేవీ చేర్చబోమన్నారు. కొన్ని అంశాలపై సమయం అవసరమని బీజేపీ నమ్ముతుందని, సమయమిస్తే రెండు పార్టీలు వాటిపై చర్చించే వీలుందన్నారు. ఈ విషయాల్నే తాను మెహబూబాకి చెప్పాన న్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల మధ్య చర్చ జరిగిందన్నారు. సంయుక్త కార్యచరణ అమలు వల్లే ముఫ్తీ మహ్మద్ పాలనలో ప్రభుత్వం చక్కగా పనిచేసిందనే విషయాన్ని మెహబూబాకు గుర్తుచేశానన్నారు. -
4 లక్షలమంది జలదిగ్బంధంలోనే..
* సురక్షిత ప్రాంతాలకు 47 వేలమంది * వర్షం తగ్గుముఖం,.. ముమ్మరంగా సహాయం * 200దాటిన మృతుల సంఖ్య * రక్షించిన వారి జాబితాను వెబ్సైట్లో పెట్టాలని కాశ్మీర్ సర్కార్‌కు కేంద్రం ఆదేశం శ్రీనగర్ : జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకూ 47 వేల మంది బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా, ఇంకా 4లక్షలమందికిపైగా జనం జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. బాధితుల తరలింపులో పౌరవిమాన శాఖ, ప్రభుత్వ, ప్రైవేట్ హెలికాప్టర్ సంస్థలుకూడా రంగప్రవేశం చేశాయి. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను ఉచితంగా తరలించేందుకు బుధవారం అదనంగా రెండు విమానాలను శ్రీనగర్‌కు నడుపుతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరో వైపు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి రక్షించిన బాధితుల జాబితాను ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తద్వారా తమవారి సమాచారంతో బాధితుల కుటుంబ సభ్యులు ఊరటచెందే అవకాశం ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి చెప్పారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న టెలికమ్యూనికేషన్ సదుపాయాలను దశలవారీగా పునరుద్ధరించగలమని అధికారులు చెప్పారు. దెబ్బతిన్న టెలికం సంబంధాలు, బోట్ల కొరత కారణంగా సహాయ కార్యక్రమాల నిర్వహణ కష్టతరమవుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటికే వినియోగిస్తున్న 110 ఆర్మీ బోట్లు, 148 ఎన్డీఆర్ఎఫ్ బోట్లు సరిపోకపోవడంతో, ఢిల్లీనుంచి విమానాల ద్వారా అదనపు బోట్లు తెప్పిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో లక్షమంది సైనికులు పాలుపంచుకుంటున్నారు. రాజధాని శ్రీనగర్‌లో కొన్నిచోట్ల వరదనీరు ఒకటిన్నర అడుగులనుంచి 3అడుగులవరకూ తగ్గినా, ఉత్తర ప్రాంతంలో, దాల్ సరస్సులో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. దాల్ సరస్సునుంచి పొంగిన నీటిప్రవాహం హజరత్ బాల్ దర్గా చుట్టూ ఉన్న మైదానంలోకి చేరుతున్న దృశ్యాలు టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. వైమానిక దళం తరలించిన 310 మంది బాధితులలో ఒక కొరియన్ జంట, ఆర్మీ మేజర్ జనరల్ ఉన్నారు. వివిధప్రాంతాల్లో చిక్కుకుపోయిన 300మంది కేరళవాసుల్లో మలయాళం సినీనటి అపూర్వ బోస్ కూడా ఉన్నారు. లే ప్రాంతంనుంచి కాశ్మీర్‌లోయ వర కు ఉన్న రహదారిని ఆర్మీ ఇంజనీర్లు, సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది పునరుద్ధరించారు. పాక్ గోల్ఫ్ జట్టును కాపాడిన ఆర్మీ న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగ ర్లో వరదల్లో చిక్కుకుపోయిన 28మంది క్రీడాకారుల పాకిస్థాన్ గోల్ఫ్ జట్టును, నేపాల్ రాయబారిని భారత సైన్యం కాపాడింది. సార్క్ గోల్ఫ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు పాక్ గోల్ఫ్ జట్టు, అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు 17మంది ప్రతినిధుల నేపాల్ బృందం శ్రీనగర్ వచ్చి వరదల్లో చిక్కుకుపోయినట్టు సైన్యాధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా కాపాడా మన్నారు. సహాయ బృందాలకోసం గూగుల్ యాప్ వరదప్రాంతాల్లో బాధితులను గుర్తించేం దుకు, గతంలో ఉత్తరాఖండ్ వరదల్లో విజయవంతమైన’పర్సనల్ ఫైండర్’ గూగుల్ అప్లికేషన్‌ను ప్రస్తుతం జమ్ము కాశ్మీర్‌లోనూ వినియోగించబోతున్నారు. సహాయక బృందాలు సమర్థంగా పనిచేసేందుకు ’పర్సనల్ ఫైండర్’ దోహదపడుతుంది. వైపరీత్యాల్లో చిక్కుకుపోయిన తమ బంధువు, స్నేహితుల తాజా స్థితిగతులను ప్రత్యేకమైన ఈ వెబ్అప్లికేషన్ ద్వారా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. -
కాశ్మీర్ సర్కారును పడగొట్టాలనుకోలేదు: వీకే సింగ్
అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే ఓ స్వచ్ఛంద సంస్థకు భారత సైన్యం నుంచి నిధులు మంజూరుచేశాం తప్ప.. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమీ ఇవ్వలేదని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ స్పష్టం చేశారు. గులాం హసన్ మీర్ అనే కాశ్మీరీ మంత్రికి ఆర్మీ నుంచి రహస్యంగా నిధులు వెళ్లాయన్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిచ్చారు. యువతను అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆకర్షితులు చేయడానికి డబ్బులు అవసరమైతే ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. కోటి రూపాయలతోనే మన లాంటి గొప్ప దేశంలో ప్రభుత్వాలు పడిపోయేటట్లయితే రోజుకో ప్రభుత్వం పడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, మహిళలకు శిక్షణ, పిల్లలను రాళ్లు విసిరే కార్యక్రమాల నుంచి దూరంగా తేవడం లాంటి కార్యక్రమాలు చేయడానికే ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేయడానికి మంత్రి మీర్‌కు రూ. 1.19 కోట్ల ఆర్మీ నిధులు వెళ్లినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.