వేర్పాటువాదులపై కఠిన వైఖరి!
ప్రధాని నిర్ణయంతో సిద్ధమవుతున్న హోం శాఖ
- పాస్‌పోర్టుల స్వాధీనం, భద్రత కుదింపు
- కశ్మీర్ ప్రభుత్వ మెతక వైఖరిపై అసంతృప్తి
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యకు కనుచూపు మేరలో పరిష్కారం కానరాకపోవడంతో ఇక నుంచి దూకుడుగా వెళ్లాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంతవరకూ వేర్పాటువాదుల విషయంలో సంయమనం పాటించిన మోదీ సర్కారు కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించింది. వారి పాస్‌పోర్టుల్ని వెనక్కి తీసుకోవడం, భద్రత కుదింపు వంటివి అందులో కొన్ని.. జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన అఖిలపక్ష బృంద ఎంపీలతో మాట్లాడేందుకు వేర్పాటువాదులు నిరాకరించడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తిగా ఉంది. కశ్మీర్‌లో పరిపాలన లోపాలున్నాయని భావిస్తున్న కేంద్రం... తక్షణం దానికి పరిష్కారం కనుగొనాలని యోచిస్తోంది.
వేర్పాటువాదుల విషయంలో కశ్మీర్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని, ఇకపై కఠినవైఖరి తప్పదనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఈ నేపథ్యంలోనే వేర్పాటువాదుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలతో పాటు, బ్యాంకు ఖాతాల్ని నిశితంగా పరిశీలించనున్నారు. వారిపై పెండింగ్ కేసుల విచారణ పూర్తి చేయడంపై కూడా దృష్టిపెడతారు. కఠినవైఖరి అవలంబిస్తామన్న విషయం వేర్పాటువాదులకు తెలియచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న మోదీ నిర్ణయంతో కేంద్ర హోం శాఖ ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది.
రెండ్రోజుల పర్యటనపై మోదీకి వివరణ.. మరోవైపు కశ్మీర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీకి హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. అఖిలపక్ష ప్రతినిధి బృందం రెండ్రోజుల పర్యటన వివరాల్ని గంట పాటు సాగిన భేటీలో ఇరువురు చర్చించారు. వియత్నాం, చైనా పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ప్రధాని భారత్ చేరుకోగా, కశ్మీర్ పర్యటన ముగియడంతో రాజ్‌నాథ్ కూడా సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. వేర్పాటువాద నేతల చర్యలు ప్రజాస్వామ్యం, మానవత్వం, కశ్మీరీయత్‌కు వ్యతిరేకమని, కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. కశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడాలని అఖిలపక్ష బృందం కలిసిన ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారన్నారు.
కశ్మీర్‌లో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేత.. కశ్మీర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం ఆందోళనకారులు, భద్రతాదళాలకు మధ్య హింసలో ఒక యువకుడు మరణించాడు. దీంతో కశ్మీర్ ఆందోళనల మృతుల సంఖ్య 73కి పెరిగింది. ఆదివారం సొపోర్ అల్లర్లలో గాయపడ్డ ముజబ్ నగూ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. మరోవైపు పరిస్థితి మెరుగుపడడంతో శ్రీనగర్ మొత్తం కర్ఫ్యూ ఎత్తివేసినా... వేర్పాటువాదుల బంద్ పిలుపుతో సాధారణ జనజీవనం మాత్రం మెరుగుపడలేదు. దీంతో రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేసినట్లయింది.
సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలు.. వాస్తవాధీన రేఖ వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. సోమవారం అర్థరాత్రి నుంచి పూంచ్ సెక్టార్‌లో ఎలాంటి కవ్వింపు లేకండా పాక్ ఆర్మీ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.