కశ్మీర్ సర్కారు ఏర్పాటు వేగవంతం
కొన్ని అంశాల అమలుకు సమయం కోరాం: రాంమాధవ్
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి అతిత్వరలో తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి. భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరు పార్టీలు సుముఖంగా ఉండడంతో పాటు సంయుక్త కార్యాచరణను నిర్ధిష్ట కాలపరిమితితో అమలుకు బీజేపీ సిద్ధమవడంతో చర్చలు పట్టాలెక్కాయి. సంక్షోభ నివారణకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబాతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ బుధవారం చర్చలు జరిపారు. గతంలో ఇరు పార్టీలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకే భాగస్వామ్య ప్రభుత్వం కొనసాగుతుందని రాంమాధవ్ చెప్పారు.
గత ఏర్పాట్ల మేరకే ప్రభుత్వాన్ని ఇవ్వగలమని, సంయుక్త ఎజెండా అమలుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎజెండా అమలులో జాప్యం ఉండదని, కొత్తవేవీ చేర్చబోమన్నారు. కొన్ని అంశాలపై సమయం అవసరమని బీజేపీ నమ్ముతుందని, సమయమిస్తే రెండు పార్టీలు వాటిపై చర్చించే వీలుందన్నారు. ఈ విషయాల్నే తాను మెహబూబాకి చెప్పాన న్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల మధ్య చర్చ జరిగిందన్నారు. సంయుక్త కార్యచరణ అమలు వల్లే ముఫ్తీ మహ్మద్ పాలనలో ప్రభుత్వం చక్కగా పనిచేసిందనే విషయాన్ని మెహబూబాకు గుర్తుచేశానన్నారు.