ఉత్తమ్‌కు శంకరమ్మ గండం
చీలే తెలంగాణ ఓటుతో కాంగ్రెస్‌కే నష్టం
అయోమయంలో పార్టీ శ్రేణులు
గండం నుంచి బయట పడేందుకు కొనుగోళ్ల వ్యాపారం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇప్పుడు అందరి దృష్టి హుజూర్నగర్ నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షిం చుకుంటున్నారు. ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు. ముఖాముఖి గట్టిపోటీ అనుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ రోజురోజుకూ పుంజుకుంటుండడంతో కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది.
ఆమె చీల్చుకునే ఓట్లు కచ్చితంగా తెలంగాణ సెంటిమెంటుకు చెంది నవే కావడం.. ఇదే ఓటుపై ఆశపెట్టుకున్న కాంగ్రెస్‌కు గండంగా మారింది. తెలంగాణ ఉద్యమం జరి గినన్నాళ్లూ ఏనాడూ ఉద్యమం ఊసెత్తని అప్పటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై శంకరమ్మ పల్లెల్లో గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన యువతీ యువకుల కుటుంబాలు హుజూర్నగర్, కోదాడ నియోజవర్గాల్లో ఉన్నాయి.
కానీ, ఇప్పటి వరకు ఏనాడూ ఆ కుటుంబాలను ఆయన పరామర్శించలేదని, ఇప్పుడు జై తెలంగాణ అంటూ తిరగడాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశ్నిస్తుండడం ఓటర్లను ఆలోచింపజేస్తోంది. గత ఏడాది జనవరి ఒకటో తేదీన నిర్వహించిన కేంద్ర మంత్రి చిరంజీవి, ఇతర మంత్రుల పర్యటనలో ఎవరినీ కనీసం తెలంగాణ నినాదం చేయనీయకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
సీమాంధ్రకు చె ందిన మంత్రులు అందరికీ వివిధ అభివృద్ధి పనుల పేర నియోజకవర్గంలో పర్యటింపజేశారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని రెండు పర్యాయాలు పర్యటనకు తీసుకువచ్చారు.
ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు తెలంగాణ అంటే సరిపోతుందా అన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. కేవలం ఈ ఎన్నికల్లో గట్టేక్కేందుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ పాట పాడుతుండడాన్ని తెలంగాణ వాదులంతా వేలెత్తి చూపుతున్నారు. ‘తెలంగాణ అమరవీరుల త్యాగాల మీద పదవులు ఎక్కాలని చూడొద్దు. నీవు ఉత్తముడివైతే శంకరమ్మ మీద పోటీ నుంచి తప్పుకోవాలి..’ అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నల్లగొండ బహిరంగ సభలో సవాలు చేసిన అంశాన్ని అంతా గుర్తుచేస్తున్నారు.
గ డిచిన ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ వివిధ ఎన్నికల్లో సముచితమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకుని ప్రజల్లో సుస్థిరం కావడం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మింగుడు పడడం లేదు. సమఉజ్జీగా తయారైన వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డిని ఎదుర్కోవడం, మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి శంకరమ్మ చీల్చే తెలంగాణ సెంటిమెంటు ఓటును కాపాడుకోవడం కత్తిమీది సాముగా మారింది.
దీంతో ఉత్తమ్ అనుచరగణమంతా తెరవెనుక మంత్రాంగం నడపుతున్నారు. ఓట్ల కొనుగోలులో మునిగి తేలుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ సీనియర్ నాయకుడు సామల శివారెడ్డి ఆ పార్టీకి రాంరాం చెప్పి టీఆర్ఎస్లో చేరడం కూడా కాం గ్రెస్‌కు రావాల్సిన ఓట్లపై ప్రభావం చూపనుంది. ఇలాపలు రకాలుగా తమ ఓట్లు చీలిపోతుండడంతో ఆ పార్టీ నాయకత్వం అయోమయానికి గురవుతోంది.