టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి: శంకరమ్మ
అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి అసెంబ్లీ నుండి టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలోనే శంకరమ్మ బుధవారం కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ హామీనిచ్చారు. ఎమ్మెల్యే టికెట్‌నే ఇవ్వాలని, ఎమ్మెల్సీ వద్దని శంకరమ్మ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ టికెట్‌ను ఇవ్వకుంటే శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్న ఎల్‌బీ నగర్ చౌరస్తాలోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. 3 రోజుల సమయం ఇవ్వాలని, ఆలోచించి చెబుతానని కేసీఆర్ కోరినట్టుగా శంకరమ్మ విలేకరులకు వివరించారు.