శ్రీకాంతాచారి విగ్రహం వద్ద మాట్లాడుతున్న తల్లి శంకరమ్మ
మన్సూరాబాద్(హైదరాబాద్): ‘నా భర్త కాసోజు వెంకటాచారిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మభ్యపెట్టి తన పార్టీలో చేర్చుకున్నారు’అని తెలంగాణ మలిదశ ఉద్యమ తొలిఅమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. హైదరాబాద్ ఎల్‌బీ నగర్ చౌరస్తాలో ఉన్న శ్రీకాంతా చారి విగ్రహం వద్ద ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబసభ్యులు వీరాచారి, లలితతో కలసి మాట్లాడారు.
బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని, తమ కుటుంబంపై కేఏ పాల్ 15 రోజులుగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అమరువీరుల కుటుంబాలవారు తమ పార్టీలో చేరాలని ఖమ్మంకు చెందిన భద్ర అనే వ్యక్తితో రాయబారం చేసి ఒత్తిడి పెంచారని అన్నారు. గత 3 రోజులుగా తన భర్తను కేఏ పాల్ బంధించారని, సెల్‌ఫోన్ లాక్కున్నారని, ఏ హాని జరిగినా కేఏపాల్ బాధ్యత వహించాలని అన్నారు. ‘నా భర్తను విడిపించడానికి వెళ్తే నీ భర్త నీతో ఉండటానికి ఇష్టపడటంలేదనే లెటర్‌ను ఇచ్చి నన్ను తిప్పి పంపారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం జోలికి వస్తే ఖబడ్డార్, చిచ్చు పెడుతున్న కేఎపాల్ కాళ్లు విరగ్గొడతానని శంకరమ్మ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment