సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది. దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాకు పౌరసత్వం సమస్యను సృష్టిస్తే..వారసత్వంతో కొడతా అంటోంది ఆ ఎన్‌ఆర్‌ఐ. ఎర్రబెల్లిని ఓడిస్తా అంటున్న ఆ ఎన్‌ఆర్‌ఐ ఎవరు? ఏమా కథ?
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సరికొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపింది. ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు. ఎర్రబెల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సుకూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి..ఎన్నికల బరిలో దిగడం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు.
ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓ సారి ఎంపీగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్ధులు మళ్ళీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా కొనసాగుతూ ఏడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు పాలకుర్తి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు.
సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు. ఆమె రాకతో రాజకీయంగా కాస్త ఇబ్బంది పడ్డారు ఎర్రబెల్లి. సరైన అభ్యర్థి దొరికారని కాంగ్రెస్ సంబరపడుతుండగా ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఇక ఎర్రబెల్లి పై పోటీకి సరైన అభ్యర్థి లేరని అందరూ అనుకుంటుండగా...రాజకీయ అనుభవం లేకున్నా.. ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ ఝాన్సీరెడ్డి తన కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు.
కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశశ్వనిరెడ్డితో కలిసి అత్త నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు. భారీ ర్యాలీతో గులాబీ గూటిలో గుబులు పుట్టించారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్న ఝాన్సీరెడ్డి పౌరసత్వం రాకుండా అడ్డుకుంటే వారసత్వంతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు అమెరికాను వదిలి పురిటిగడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలును ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు. మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎర్రబెల్లి మాత్రం ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారాచ్యూట్ నేతలకు పాలకుర్తిలో స్థానం లేదంటున్నారు.
రాజకీయంగా ఝాన్సీరెడ్డి దూకుడు పెంచడంతో మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పాలకుర్తిలో సర్వే రిపోర్ట్ లు సైతం ఆందోళన కలిగిస్తుండడంతో ఎర్రబెల్లి వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మనిషిగా రికార్డు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయ పరిణామాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎర్రబెల్లి తోపాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు సైతం రంగంలోకి దిగి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ప్రచారం సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేడర్‌తో ఝాన్సీరెడ్డి ఆమె కోడలు యశశ్వనిరెడ్డి.. ఇటు ఎర్రబెల్లి కుటుంబసభ్యులు, గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఎర్రబెల్లికి ఎదురు లేదనుకున్న పాలకుర్తిలోఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి రాకతో రాజకీయం అలజడి మొదలైంది. పోటాపోటీ ప్రచారాలతోపాటు ఇరుపక్షాలవారు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్దం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా వార్ సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు శృతిమించి కేసుల వరకు వెళ్ళాయి. రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి కి వణుకు పుట్టించే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిన ఎర్రబెల్లికి ఈ ఎన్నిక ఓ లెక్క కాదనే వాదనా వినిపిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment