సాక్షి,హైదరాబాద్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను స్పీకర్‌ని. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. శాసన సభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు.
మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. మా శాసన సభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నాము. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పై విధంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment