నైట్‌రైడర్స్‌లో విభేదాలు నిజమే: కటిచ్
ముంబై: ఆరంభంలో విజయాలు సాధించి, తర్వాత వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఆఖరికి గెలిస్తే తదుపరి దశకు చేరే అవకాశమున్న చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ముంబై చేతిలో దారుణంగా పరాజయం పాలైంది. తమ జట్టులో మంచి వాతావరణం లేదని, కెప్టెన్ దినేశ్ కార్తీక్ వ్యూహాలు సరిగా లేవంటూ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. మైదానంలోనూ ఈ విభేదాలు కనిపించాయి. వీటిని ఆ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ కూడా నిర్ధారించాడు. ఆదివారం ముంబైతో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ... ‘మేం లీగ్‌ను గొప్పగా ప్రారంభించాం. కానీ, సొంతగడ్డపై బెంగళూరు, రాజస్తాన్ చేతిలో ఓడిపోవడం దెబ్బతీసింది.
చివరి మ్యాచ్‌లో మలింగ, బుమ్రా, హార్దిక్ లాంటి బౌలర్లున్న ముంబైతో, మాకు మంచి రికార్డు లేని వాంఖడేలో ఆడాల్సి రావడం ప్రతికూలమైంది. పాయింట్ల పట్టికలో మేం నిలిచిన స్థానానికి (5వ) అర్హులమే. జట్టులో సమష్టితత్వం లోపించిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. మేం దృష్టి సారించి, సరిదిద్దుకుని ముందుకుసాగాల్సిన అంశాలివి. ఒకరిద్దరి గురించి చెప్పడం సరికాదు కానీ, బ్యాటింగ్‌లో యువ శుబ్‌మన్ గిల్ మా భవిష్యత్ స్టార్’ అని పేర్కొన్నాడు.