కోల్కతా: ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ సైమన్ కటిచ్ పనిచేయనున్నారు. ఈ మేరకు కేకేఆర్ సీఈవో వెంకీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే కేకేఆర్ కోచ్గా దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్ కలీస్ను తీసుకున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కోచ్గా కటిచ్ నియామకంపై కలీస్ మాట్లాడుతూ ' జట్టు మేనేజ్మెంట్లోకి కటిచ్ చేరుతుండడం ఆనందంగా ఉంది. అతనితో ఎన్నో మ్యాచ్లలో ప్రత్యర్థిగా ఆడాను, అతనికి ఆటపై గల అవగాహన అమోఘం. కటిచ్ అసిస్టెంట్ కోచ్గా ఉండడం 2016 ఐపీఎల్ టైటిల్ను కోల్కతా గెలుచుకోవడానికి సహాయపడుతుందని' అన్నారు.
సైమన్ కటిచ్కు ఆస్ట్రేలియా ఓపెనర్గా మంచి పేరుంది. రిటైర్మెంట్కు ముందు బిగ్బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కెప్టెన్గా ఆయన పనిచేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫుట్బాల్ లీగ్ క్లబ్కు ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్న కటిచ్ త్వరలోనే కోల్కతా జట్టుతో చేరనున్నారు.