వైఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
ముదిగుబ్బ, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వైఎస్సార్ సీపీ నేత, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మండలంలోని పులివెందుల రోడ్డు నుంచి నక్కలపల్లి వరకు రూ. 77.25 లక్షల పీఎంజీఎస్‌వై నిధులతో తారురోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే శిలా ఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు పథకంతో అన్ని గ్రామాలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. మండలంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు.
తమ హయాంలో చిన్నకోట్ల గ్రామానికి రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. మండల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు రూ. 14.50 కోట్ల వ్యయంతో సత్యసాయి తాగునీటి పథకం పనులు పూర్తయ్యాయని, త్వరలో దీన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు.
నక్కలపల్లికి కూడా సత్యసాయి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తోనే సమైక్యాంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. కార్యక్రమంలో ధర్మవరం మార్కెట్ యార్డు చైర్మన్ రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి, దొరిగిల్లు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.