బీసీలకూ 3 ఎకరాల భూమి
* బీసీ సంఘాల విస్తృత సమావేశం డిమాండ్
* రూ. 20 వేలకోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చెయ్యాలి
* కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలి
* డిమాండ్ల సాధనకోసం పార్టీలకు అతీతంగా ఒక్కటవ్వాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెనుకబడిన తరగతులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, రూ.20 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని బీసీ సంక్షేమ, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల విస్తృత భేటీ డిమాండ్ చేసింది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌చేస్తూ ఈ సమావేశం తీర్మానాలను ఆమోదించింది.
శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ హోటల్లో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన బీసీ సంఘాల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, రూ.20వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని, బడ్జెట్ కేటాయింపులను రూ.2వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయపార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఏకమై డిమాండ్ల సాధనకు పోరాడాలని, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ముందుకు రావాలని ఆయన అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తిచేశారు. దేశంలోని బీసీలను పాలకపార్టీలు అణచివేస్తున్నాయన్నారు. దేశజనాభాలో 56 శాతమున్న బీసీలకు వారి జనాభాప్రాతిపదికన ఉద్యోగాలు, ప్రమోషన్లు, చట్టసభల్లో ప్రవేశంలో న్యాయం జరగడం లేదన్నారు. ప్రస్తుతం భర్తీచేయాల్సిన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 14 లక్షల ఉద్యోగాలు, తెలంగాణలోని 2 లక్షల ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 1.5లక్షల ఉద్యోగాల్లో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌చేశారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళ, వికలాంగుల రిజర్వేషన్లకు లేని క్రీమీలేయర్‌ను రాజ్యంగ లక్ష్యాలకు భిన్నంగా బీసీలకు మాత్రమే అమలుచేయడం సరికాదన్నారు. క్రీమీలేయర్ నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలని ఆయన డిమాండ్‌చేశారు. పార్లమెంట్లో బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించాలని, కేంద్రంలో రూ.50 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేయాలని, కులవృత్తుల్లో సాంకేతికను పెంచుకుని ఆధునికంగా ఎదిగేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్‌చేశారు.
ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి: జాజుల
చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. అసెంబ్లీలో చెప్పిన మేరకు సీఎం కేసీఆర్ వెంటనే బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 10న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్రీమీలేయర్‌ను తొలగించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు విన తిపత్రాలు సమర్పించడం, 14న అన్ని కులసంఘాలతో సమావేశం, 18న కళ్యాణలక్ష్మిని వర్తింపజేయాలన్న డిమాండ్‌పై హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద, అలాగే జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు చేపడుతున్నామన్నారు.
జనవరి మొదటివారంలో సభ్యత్వనమోదు, ఫిబ్రవరి మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీలను చైతన్యపరిచేందుకు ‘మేలుకొలుపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నిరంజన్ (ఆర్టీసీ ఉద్యోగులసంఘం), బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా దారుట్ల కృష్ణుడు (ఆదిలాబాద్), బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సాయికిరణ్‌లను ఎన్నుకున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు.