కుమార్తెకు లోకేషన్ షేర్... మిస్టరీగా రత్నభాస్కర్ ప్రమాదం
పెనమలూరు: విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై వెళ్తున్న కారు కేఈబీ కెనాల్లోకి సోమవారం వేకువజామున దూసుకెళ్లింది. కాలువలో నాలుగడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో కారు సగ భాగం పైగా నీటిలో మునిగింది. కారులో ముందు డోర్ తెరిచి ఉండటంతో కారులో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడా లేక కాలువలో గల్లంతయ్యాడా అనే విషయంలో స్పష్టత లేదు.
పోలీసులు తెలిపిన వివరాలు..
ముదినేపల్లికి చెందిన గాజుల రత్నభాస్కర్ (47) గత ఆరు నెలల క్రితం బ్యాంకు రుణం తీసుకుని ఐస్ ఫ్యాక్టరీ పెట్టాడు. అతను ఆదివారం అవనిగడ్డలో ఉన్న అత్తగారి ఇంటి వద్ద నుంచి సాయంత్రం బయలుదేరి మచిలీపట్నం వెళ్లాడు. అక్కడ కోనేరు సెంటర్లో టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. మరలా పది గంటల ప్రాంతంలో మిత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి మచిలీపట్నంలో పని ఉందని, అది ముగించుకొని ముదినేపల్లికి వస్తానని తెలిపాడు. అయితే అతను రాత్రి ముదినేపల్లికి చేరలేదు.
చోడవరం వద్ద కాలువలో కారు..
గాజుల భాస్కర్‌కు చెందిన కారు అవనిగడ్డ వైపు నుంచి విజయవాడ వైపునకు వస్తుండగా చోడవరం వద్ద సోమవారం వేకువజామున 3.30 గంటలకు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో కారు పడిందన్నా సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. కాలువలో పడిన కారు ముందు డోర్ తెరుచుకొని ఉంది. పోలీసులు కారులో వెతకగా ఆధార్‌కార్డు దొరకటంతో గాజుల రత్నభాస్కర్ అని గుర్తించారు. కానీ కారులో ఎవ్వరు లేరు. డీఎస్పీ జయసూర్య ఘటనా స్థలం వద్దకు వచ్చి క్రేన్ సాయంతో కాలువలో ఉన్న కారును బయటకు తీయించారు. కారులో దుస్తులు, సెల్‌ఫోన్, కాగితాలు తప్ప ఏమి దొరకలేదు. కనిపించకుండా పోయిన రత్నభాస్కర్కు భార్య, కుమార్తె ఉన్నారు.
మిస్టరీగా మారిన ఘటన..
కేఈబీ కెనాల్లో పడిన కారు ఘటన మిస్టరీగా మారింది. ముదినేపల్లికి వెళ్లాల్సిన రత్నభాస్కర్ అర్ధరాత్రి విజయవాడ వైపునకు ఎందుకు వచ్చాడనేది పెద్ద ప్రశ్నగా ఉంది. పైగా ప్రమాదం జరిగే ముందు తన ఫోన్‌తో కుమార్తెకు లోకేషన్ షేర్ చేశాడు. కాలువలో పడిన కారును పోలీసులు తనిఖీ చేయగా సెల్‌ఫోన్ కారులోనే ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. కారు కాలువలో పడిన సమయంలో కాలువలో నీరు నాలుగడుగులు మాత్రమే ఉంది. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో కాలువలో రత్నభాస్కర్ కొట్టుకు పోయాడా లేదా అనే విషయం తేలలేదు.
పోలీసులు కేఈబీ కెనాల్లో గాలింపు చేపట్టారు. కరకట్టపై ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రత్నభాస్కర్కు కొందరు సొమ్ము బాకీ పడటంతో ఆర్థిక గొడవలు ఏమైనా ఉన్నయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రుణం తీసుకుని ఐస్‌ఫ్యాక్టరీ పెట్టడంతో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయమై పోలీసులు బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించనున్నారు. బంధువు మేడిశెట్టి సూర్యప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.