కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది.
చల్లపల్లి: కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మంగళవారం ఉదయం ఆంజనేయస్వామి ఆలయం కుప్పకూలింది. స్థానికుల కథనం మేరకు.. కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో భాగంగా వంతెన సెంటర్‌లో కాల్వ పక్కనే 18 అడుగుల లోతున గోయి తవ్వారు. కాల్వకు ఆనుకునే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. అయితే, తాగు నీటి కోసం కేఈబీ కెనాల్‌కు సోమవారం నీటిని విడుదల చేశారు. దీంతో మట్టి నానిపోవడంతో ఆంజనేయస్వామి ఆలయం కాల్వలోకి కుప్పకూలింది.
ఈ ఘటనలో స్వామి విగ్రహం కూడా పూర్తిగా శిధిలమైంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కాంట్రాక్టర్ అంగీకరించడంతో స్థానికులు తమ ఆందోళన విరమించారు. అనంతరం శిధిలమైన స్వామి విగ్రహ భాగాలను కృష్ణా నదిలో నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఊరేగింపుగా పులిగడ్డకు తీసుకెళ్లారు.