ప్రిన్స్టన్ డీన్‌గా భారతీయుడు
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. ప్రొఫెసర్ సంజీవ్ కులకర్ణిని ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు డీన్‌గా నియమించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్, కెల్లర్ సెంటర్ డెరైక్టర్‌గా ఉన్న కులకర్ణి మార్చి 31న కొత్త బాధ్యతలు చేపడతారని బుధవారం యూనివర్సిటీ ప్రకటించింది.
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న ఈ వర్సిటీకి 2002 నుంచి విలియం రస్సెల్ డీన్‌గా ఉంటున్నారు. ‘సంజీవ్ కులకర్ణి ప్రిన్స్టన్ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు అద్భుతమైన డీన్‌గా వ్యవహరిస్తారు’ అని ప్రిన్స్టన్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ ఐస్బ్రూగెర్ కొనియాడారు. ప్రిన్స్టన్లో 1991లో ఫ్యాకల్టీగా చేరిన కులకర్ణి మాట్లాడుతూ, తనను డీన్‌గా నియమించినందుకు సంతోషం వ్యక్తంచేశారు. యూనివర్సిటీతో 20 ఏళ్లకుపైగా అనుబంధముందని, ప్రిన్స్టన్కు మరిన్ని సేవలు చేసేందుకు మంచి అవకాశం లభించిందని చెప్పారు.