Kepler Wessels
-
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
ఒక బంతి.. 22 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అదో చెత్త నిర్ణయంగా మిగిలిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌తో దురదృష్టానికి దగ్గరగా.. అదృష్టానికి దూరంగా నిలిచిపోయింది సౌతాఫ్రికా. నిషేధం తర్వాత ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆ మ్యాచ్ ఒక చీకటి రోజు. 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే లెక్కలు వేసి మరి దక్షిణాఫ్రికాను ఇంటి దారి పట్టేలా చేశారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో సఫారీ టీం తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి. అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా... ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్ టార్గెట్ ను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే పెద్ద ట్విస్ట్ సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేసింది. మైదానంలో ఉన్న స్క్రీన్ పై సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం చేయకుండా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. పాపం అంపైర్లు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కొత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. 1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమల్లోకి వచ్చింది. ఈ మ్యాచ్ సరిగ్గా మార్చి 22 ,1992న జరగ్గా.. సరిగ్గా నేటితో 30 ఏళ్లు పూర్తైంది. చదవండి: IPL 2022: టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..? -
భారత్‌ను ఓడించడం అంత ఈజీ కాదు!
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తోంది. వరుసగా మూడు వన్డేల్లో నెగ్గిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా శనివారం జరిగిన నాలుగో వన్డేలో ఓటమి పాలైంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లర్ వెస్సెల్స్ స్పందించాడు. కోహ్లి నేతృత్వంలోని ప్రస్తుత వన్డే జట్టును ఓడించడం 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఏ జట్టుకైనా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. టీమిండియా తన ఫెవరెట్ మాత్రం కాదని, అయితే బలమైన జట్టు అని తాను నమ్ముతున్నట్లు తెలిపాడు. భారత జట్టు వన్డేల్లోనూ బలమైన ప్రత్యర్థిని ఓడించగలదు. అందులోనూ కోహ్లి లాంటి ఆటగాడు పరుగులు చేయడం, కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికా టెస్టు, వన్డే జట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. టెస్టు సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లు కొందరు మాత్రమే సఫారీ వన్డే టీమ్‌లో కొనసాగుతున్నారు. అందుకే నాణ్యమైన ఆటతీరును ఆతిథ్య జట్టు ప్రదర్శించలేక పోతుంది. భారత్ విజయానికొస్తే.. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రా లాంటి మేటి ఫాస్ట్ బౌలర్లు ప్లస్ పాయింట్. భువీ బంతితో పాటు బ్యాట్‌తోనూ జట్టు విజయాల్లో కీలక పోషిస్తాడు. యార్లర్లతో ప్రత్యర్ధి బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టగల నైపుణ్యం బూమ్రా సొంతం. రోహిత్ లోపం అదే! దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన ఆటగాడు, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. టెస్టుల్లో ఏమాత్రం రాణించని రోహిత్.. వన్డే సిరీస్‌లో గత నాలుగు వన్డేల్లోనూ చెత్త షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నాడు. ఫుట్‌వర్క్ లోపం వల్లే రోహిత్ త్వరగా ఔట్ అవుతున్నాడు. అందుకే రోహిత్ సగటు ఇక్కడ 10 ఉంది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం స్థాయికి తగ్గట్లు పరుగులు సాధిస్తున్నాడు. షార్ట్ పిచ్ బంతులు ఆడలేకపోయినా.. చెత్త బంతులను వదిలేస్తూ జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందిస్తున్నాడని కెప్లర్ వెస్సెల్స్ కొనియాడాడు.