Kesineni nani MP
-
చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు...’ అని విజయవాడ లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్సీపీ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని చెప్పారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ పేదల కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు మాత్రం ధనికుల కోసం పని చేస్తారని చెప్పారు. సమాజం బాగుండాలని వైఎస్ జగన్ కృషి చేస్తుంటే... బాబు మాత్రం తన కొడుకు కోసం తపనపడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్‌లా పనిచేసే వారు ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోనే సుమారు రూ.2.50 లక్షల కోట్లు జమచేశారని, ఆ భగవంతుడే సీఎం జగన్ రూపంలో పేదలకు మేలు చేస్తున్నారని ప్రశంసించారు. పేదల కోసం సీఎం జగన్ ఇన్ని చేస్తుంటే రాష్ట్రం దివాలా తీసింది... అంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్నిచిన్న రోడ్ల ఫొటోలు తీసి పచ్చ పత్రికలో పెద్దగా ప్రచురిస్తున్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగానే ఉన్నాయని నాని స్పష్టంచేశారు. వైఎస్సార్ ఆసరా కింద విజయవాడ నగరంలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చారంటే పేదలపట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత విద్య చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని గుర్తుచుశారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ‘ప్రతిపక్షాలకు దమ్ముంటే రండి. మేం చేసిన అభివృద్ధి చూపిస్తాం. మేం మంచి చేశాం కాబట్టే దమ్ముగా ప్రజల్లోకి వెళ్తున్నాం.’ అని అన్నారు. టీడీపీ, జనసేన కుల పార్టీలని, వాటికి ప్రజలకు మేలు చేయాలనే అజెండా లేదన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి కేశినేని మరో షాక్.. బాబు ఫ్లెక్సీల తొలగింపు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ పార్టీకి మరో షాకిచ్చారు. రాజీనామా ప్రకటన అనంతరం కేశినేని భవన్‌పై టీడీపీ పార్టీ జెండాలు, బ్యానర్లను కేశినేని నాని తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్, కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను మంగళవారం తొలగించారు. వాటీ స్థానంలో కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కేశినేని శ్వేత తన విజయవాడ 11 డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చదవండి: flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు ! -
పంచ్ డైలాగ్స్ తో టీడీపీకి ఝలక్ ఇస్తున్న కేశినేని నాని..!
-
టీడీపీపై కేశినేని నాని హాట్ కామెంట్స్
-
టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలి
సాక్షి, సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నాయీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే నాయీబ్రాహ్మణుల సత్తా చూపిస్తామని ఆ సంఘ నాయకులు హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించిన కేశినేనికి ఇదేమీ కొత్త కాదన్నారు. గతంలో గుంటూరులో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించారన్నారు. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉండి ఒక కులాన్ని కించపరిచేలా మాట్లాడడం అహంకారపూరితమన్నారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. నగర నాయీబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు అందనాపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నాయీ బ్రాహ్మణులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ మీ తోకలు కట్ చేస్తాను, గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను’ అని బెదిరించారన్నారు. కార్యక్రమంలో చిట్టాబత్తుల నాగబాబు, కందికొండ రమేష్, అలజంగి దేవుడు, అప్పారావు పాల్గొన్నారు. -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
ఆరు నెలలకోసారి నిద్ర లేస్తారా?
పవన్‌కల్యాణ్‌పై ఎంపీలు కేశినేని, కొనకళ్ల ఆగ్రహం విజయవాడ: పవన్ కల్యాణ్ ఆరు నెలలకోసారి నిద్రలేచి.. జూలు విదిల్చి ఏదో ఒకటి మాట్లాడి మళ్లీ నిద్రావస్థలోకి వెళ్లిపోతారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) విమర్శించారు. ‘తిడితే కేసీఆర్‌లా తిట్టాలి. పడితే ఆంధ్రా ఎంపీల్లాగా పడాలి..’ అంటూ పవన్ చేసిన ఆరోపణలపై నానితో పాటు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు తీవ్రంగా స్పందించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టుపెడితే సహించబోమని హెచ్చరించారు. విజయవాడలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు పౌరుషం చచ్చిలేరని, తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకే పవన్ కల్యాణ్ కేసీఆర్‌ను కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మెప్పు కోసమే హైదరాబాద్‌లో సెక్షన్-8 అక్కర్లేదని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు.