మాట్లాడుతున్న ఎంపీ కేశినేని నాని. పక్కన దేవినేని అవినాష్ తదితరులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు...’ అని విజయవాడ లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని చెప్పారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ పేదల కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు మాత్రం ధనికుల కోసం పని చేస్తారని చెప్పారు. సమాజం బాగుండాలని వైఎస్ జగన్ కృషి చేస్తుంటే... బాబు మాత్రం తన కొడుకు కోసం తపనపడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్‌లా పనిచేసే వారు ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు.
సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోనే సుమారు రూ.2.50 లక్షల కోట్లు జమచేశారని, ఆ భగవంతుడే సీఎం జగన్ రూపంలో పేదలకు మేలు చేస్తున్నారని ప్రశంసించారు. పేదల కోసం సీఎం జగన్ ఇన్ని చేస్తుంటే రాష్ట్రం దివాలా తీసింది... అంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్నిచిన్న రోడ్ల ఫొటోలు తీసి పచ్చ పత్రికలో పెద్దగా ప్రచురిస్తున్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగానే ఉన్నాయని నాని స్పష్టంచేశారు.
వైఎస్సార్ ఆసరా కింద విజయవాడ నగరంలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చారంటే పేదలపట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత విద్య చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని గుర్తుచుశారు.
వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ‘ప్రతిపక్షాలకు దమ్ముంటే రండి. మేం చేసిన అభివృద్ధి చూపిస్తాం. మేం మంచి చేశాం కాబట్టే దమ్ముగా ప్రజల్లోకి వెళ్తున్నాం.’ అని అన్నారు.
టీడీపీ, జనసేన కుల పార్టీలని, వాటికి ప్రజలకు మేలు చేయాలనే అజెండా లేదన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment