పోటీపరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి
ఏఎన్‌యూ: ప్రత్యేక శిక్షణతోపాటు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితేనే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ఆచార్య కె.వియ్యన్నారావు అన్నారు. యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో విజయవాడ ఏస్ ఐఏఎస్ అకాడమీ శుక్రవారం యూనివర్సిటీలో సివిల్స్, గ్రూపు-1, 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించింది.
ముఖ్యఅతిథి ఆచార్య వియ్యన్నారావు మాట్లాడుతూ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సమాజంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన అవసరమన్నారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలతోపాటు, స్వతహాగా పరీక్షలకు సిద్ధమవడం కూడా కీలకమని తెలిపారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేప్పుడు సమయం చాలా విలువైందని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్‌లో ఖాళీలు ఎక్కువగా ఉంటున్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు అభ్యర్థులు సిద్ధం కావాలన్నారు.
అన్ని అవరోధాలను అధికమించి ఐఏఎస్‌కు ఎంపికైన రేవు ముత్యాలరాజు వంటి వారిని ఆదర్శంగా తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఏఎన్‌యూ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో ఆయా రంగాల నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఏస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ వైవీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ నిరంతర కృషి, అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితే సివిల్స్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు.
అకాడమీ కోఆర్డినేటర్ ఈ.వీరబాబు ఐఏఎస్ పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు, పరీక్షకు సిద్ధమవడం, పరీక్ష రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెచ్ఆర్డీ డెరైక్టర్ డాక్టర్ బి.నాగరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.