కీలక వడ్డీరేట్ల నిర్ణాయకులు ఇక వీరే
న్యూఢిల్లీ: మొత్తానికి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఇకనుంచి కీలక వడ్డీ రేట్లను నిర్ణయించనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్టం ప్రకారం 'ద్రవ్య విధాన కమిటీ' ని నోటిఫై చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలోతెలిపింది. అక్టోబర్ 4న ఈ కమిటీ తొలి సమీక్ష నిర్వహించనుందని వెల్లడించింది. ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతివిధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఈ కొత్త మానిటరీపాలసి కమిటీ నిర్ణయించనుందని పేర్కొంది.
ప్రభుత్వం నుంచి ముగ్గురు , రిజ్వర్ బ్యాంకు కు చెందిన ముగ్గురు మొత్తం ఆరుగురు సభ్యులతో మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైంది ఇందులో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ పాత్రా, ఆర్థిక నిపుణులు చేతన్ ఘాటే, పామి దువా, రవీంద్ర హెచ్ ధోలకియాలతో కూడిన ద్రవ్య విధాన కమిటీని ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.