రిలయన్స్‌పై చట్టబద్ధంగానే చర్యలు
న్యూఢిల్లీ: గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఇచ్చిన స్థలంలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునే అంశంపై చట్టబద్ధంగానే వ్యవహరిస్తామని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే బుధవారం తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్సీ) నిబంధనలకి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామన్నారు. సదరు స్థలంలో ఉండే గ్యాస్ నిక్షేపాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా వెలికి తీయడం ద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని రే చెప్పారు. రిలయన్స్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌తో సుమారు మూడున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలు వివరించారు. ఒకవైపు పీఎస్సీకి కట్టుబడి ఉండటం, మరోవైపు నిక్షేపాలను వెలికి తీసి ఆదాయం ఆర్జించడం ఎలా అన్న రెండు సవాళ్లు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయన్నారు. నిక్షేపాల అభివృద్ధి ప్రక్రియలో వివిధ దశల డెడ్లైన్లను పలుమార్లు ఉల్లంఘించిన రిలయన్స్ నుంచి స్థలాన్ని వెనక్కి తీసుకోవడమా.. లేక దానికే మరో అవకాశం ఇవ్వడమా అన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోగలదన్నారు.
కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్‌ఐఎల్‌కి 7,645 చ.కి.మీ. కేటాయించగా.. అందులో నిక్షేపాలు వెలికితీయని 6,601 చ.కి.మీ. స్థలాన్ని కంపెనీ వెనక్కి ఇచ్చేయాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) చెబుతోంది. అయితే, తమకు మరింత సమయం ఇవ్వాలని.. గ్యాస్, చమురు నిక్షేపాలు కనుగొన్న 3,412 చ.కి.మీ. స్థలాన్ని అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలంటూ రిలయన్స్ కోరుతోంది.