KG to PG education
-
పోటీకి తగ్గట్లు ప్రిపేర్ కండి : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని, ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఉన్నతాధి కారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రితో కలిసి సీఎం గురువారం విద్యా రంగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేజీ టు పీజీలో ప్రస్తుత పరిస్థితి, తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. పాఠశాల, ఉన్నత విద్య పరిధిలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, ఖాళీలను నవీన్ మిట్టల్ వివరించారు. పాఠశాల విద్యా విభాగంలో దాదాపు 22 వేల ఖాళీ పోస్టులను ఇటీవల గుర్తించిన విషయాన్ని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఉన్నత విద్య పరిధిలో దాదాపు వెయ్యి వరకూ ఖాళీలున్నాయని వివరించారు. ఇంటర్మీ డియెట్ కళాశాలల్లో ఈ సంవత్సరం ప్రవేశాలు పెరిగాయని, సిలబస్ దాదాపు పూర్తవబోతోందని అధికారులు తెలిపారు. కోవిడ్ పరిణామాలు, విద్యా సంస్థల్లో శానిటైజేషన్ అమలు తీరుపై కాసేపు సమీక్ష జరిగినట్టు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా ఉన్నత విద్యలో మార్పులు తేవాలని సీఎం ఆకాంక్షించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఏ జిల్లాలో ఎన్ని కళాశాలలున్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? ఎలాంటి మార్పులు తీసుకు రావలసిన అవసరం ఉందో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం కోరినట్టు తెలిసింది. ఖాళీల భర్తీపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం సంకేతాలు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. -
పెట్టుబడిదారుల ఉచ్చులో కేజీ టు పీజీ?
మార్కెట్ యుగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో సామాజిక సంఘర్షణ సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతిక ఫలితాలు సామాన్యుడి దరికి చేరడం లేదు. టెక్నాలజీతో పెరిగిన సంపద సైతం వారికి అందుబాటులోకి రావడం లేదు. ఈ పరిజ్ఞానం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది అంటే అధికాదాయ వర్గాలకు చేరు తోంది. మురికివాడల్లోనూ, పూరి గుడిసెల్లోనూ ఉండే సామాన్యుడికి అందాలంటే ఇంకా విద్యకి ఆమడదూరంలో ఉన్న ఆయా వర్గాల ప్రజలు అత్యధికస్థాయిలో ఆధునిక విద్యాపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే స్థితికి చేరాలి. సంపద లాగే జ్ఞానం కూడా అందరికీ సమంగా అందు బాటులోకి రావాలి. అది జరగాలంటే ఏ వర్గాలైతే అణచివే తకు గురౌతున్నాయో, ఏ వర్గాలైతే విద్యకీ, సమాజంలోని సకల సౌకర్యా లకీ దూరమౌతున్నాయో వారే జ్ఞానసంప న్నులు కావాలి. అప్పుడే ఇన్నాళ్ళూ ఒక వర్గ ప్రజలకే అందు తోన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నూటికి తొంభైశాతంగా ఉన్న పేదలకూ, అట్టడుగు వర్గాలకూ అందుబాటులోకి వస్తుంది. వారే ఈ పేదరికానికీ, అసమానతలకూ, అణచివే తకూ భిన్నమైన సమాజాన్ని సృష్టించగలుగుతారు. సమాన తను అందరికీ పంచగలుగుతారు. సమాజ పరివర్తనకు మార్గనిర్దేశనం చేయగలుగుతారు. సరిగ్గా ఇదే విషయాన్ని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కూడా అంటారు. ఆయన అభి ప్రాయంలో సామాజిక విప్లవం పాఠశాలల్లోనే ప్రారంభం కావాలి. అదే స్ఫూర్తిని గ్రామాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం అని భావించారు విద్యాపరిరక్షకులు. అది జరగా లంటే కామన్ స్కూల్ సిస్టమ్ ఒక ఉన్నతమైన పరిష్కార మార్గమని భావించి దేశవ్యాప్తంగా ఉద్యమించారు. దానికి మన రాష్ట్రం నుంచి ప్రముఖ మేధావి, విద్యావేత్త హరగోపాల్ లాంటి విద్యాపరిరక్షకులు పోరాడుతున్నారు. కామన్ స్కూల్ సిస్టమ్ కోసమే ఉపాధ్యాయ ఉద్యమం నడుంబిగించింది. దానికి సారథ్యం వహిస్తోన్న హరగోపాల్ ద్వారా ఆ ఉద్య మానికి అంకురార్పణ చేసే అవకాశం నాకు దొరికింది. అది కూడా ఒక పవిత్రమైన స్థలంలో, ఎందరో వీరులు అమరు లైన ఉద్యమ ప్రాంగణంలో, తెలంగాణ పోరాటపతాకగా భావించే గన్‌పార్క్‌లో ఈ ఉద్యమాన్ని నాతో ప్రారంభిం పజేశారు. కేజీ టు పీజీ విద్య చింకిపాతల జీవితాలను బాగు చేస్తుందా? టెక్నాలజీ విద్యావ్యాప్తికి కారణం అయ్యింది. నిజమే. కేజీ నుంచి పీజీ స్కూళ్ళు వచ్చాయి. కానీ ఎవరి లాభం కోసం? లేక చింకిపాతల జీవితాలను బాగుచేయడానికా? కొన్ని రాజకీయ పార్టీల నినాదాల్లో ఇవి భాగం అయ్యాయి. కేజీ టు పీజీ వెనుక సైతం ఒక పెట్టుబడిదారీ వర్గం కూడా వచ్చింది. స్కూల్స్ పైన పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించడమే కాకుండా పసిపిల్లల మనసుల్లో కూడా చిన్నప్పటి నుంచే విద్యని ఒక క్యాపిటల్‌గా భావించే ఆలోచనలను చొప్పిస్తున్నారు. త్రీడీ టెక్నాలజీని విద్యావిషయాల్లో ఉపయోగించుకోవడం కూడా హర్షించాల్సిందే కానీ ఆ త్రీడీ స్కూల్స్‌లో చదువుకోవాలను కునే విద్యార్థులు ఎన్ని లక్షలు వెచ్చించాల్సి వస్తోంది? సామా న్యుడికి ఈ విధానం అందుబాటులో ఉందా? కేజీ టు పీజీ కూడా క్యాపిటల్ సమాజంలో ఒక గొలుసు వ్యవస్థగా మారింది. లక్షలు ఖర్చు చేసి విజ్ఞానాన్ని కొనుక్కోవాలి. ఉన్నత విద్యలో సీటు సంపాదించాలి. ఉద్యోగాలకోసం ఎంతో ప్రయాసపడాలి. చివరకు చదువుకి వెచ్చించిన దాన్ని మొత్తం ఉద్యోగం సంపాదించాక రాబట్టుకోవాలి. దానితో మరో క్యాపిటల్ సమాజానికి అంకురార్పణ చేయాలి. ఇదే వ్యవస్థ ప్రతిసారీ పునరావృతం అవుతోంది. కేజీ టు పీజీ విద్య నిర్వ హణ ఎవరి చేతిలో ఉండాలి? ఎవరికి సీట్లివ్వాలి? ఎవరిని యోగ్యులుగా మార్చాలి. నైపుణ్యాలను వెలికితీయాల్సింది ఎవరిలో? అంటే కచ్చితంగా పేదరికంలో మగ్గుతున్న వారికి క్వాలిటీ చదువు అందించాలి. ఎక్స్‌లెన్సీ సమత్వంపై ఆధార పడి ఉంటుంది. ఏ కొందరికో ఎక్స్‌లెన్సీ వస్తే సరిపోదు. కుగ్రామాల్లో నివసిస్తున్న నిరుపేదకు సైతం ఇది అందాలి. అప్పుడే శ్రీమంతుడికీ, సామాన్యుడికీ ఒకేరకమైన చదువు అందుబాటులోకి వస్తుంది. సరిగ్గా ఇవే విషయాలపై గళ మెత్తారు హరగోపాల్. విద్యావ్యవస్థలో ఉన్న అంతరాలే సమాజంలోని అంతరాలకు మూలమని గ్రహించారు. తెలంగాణ ఈ ఆకాంక్షలకోసమే ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినవాడు గనక తెలం గాణ రాష్ట్రం ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి కామన్ స్కూల్ సిస్టమ్‌పై ఉద్యమిస్తున్నాడు. ఇప్పుడే ఎందుకీ ఉద్యమం? అయితే ఇప్పుడే ఎందుకు ఉద్యమిస్తున్నారు అనే ప్రశ్న ఉద్భ విస్తోంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. సామాన్యుడి సమస్యలన్నీ రాజకీయ పార్టీలు వినేది ఒక్క ఎన్నికల సమయంలోనే. అంతేకాకుండా పేద, అణగారిన వర్గాలకు అందని పండుగా తయారౌతోన్న విద్య, ప్రత్యేకించి కామన్ స్కూల్ సిస్టమ్ రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లోకి చేరాలంటే ఉద్యమం ఒక్కటే మార్గం. అందుకే ఈ ఉద్యమం ఇప్పుడే ప్రస్తుతమని భావించారు. చైతన్యవంతమైన వారు ఈ ఉద్య మాలకు స్పందిస్తారనీ, అభ్యుదయ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారనీ, దీక్షాపరులైన శాసనసభ్యులు ఎన్నికవుతా రనీ ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తోన్న హరగోపాల్ అభిప్రాయం. కానీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని అందుకోవడం కోసమే డబ్బు వెదజల్లుతూ, దానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ ప్రచారానికి అడ్డంకిగా తమ పవర్‌ను ప్రయోగించారు. పోలీసు బలగాలను ఉపయోగిం చారు. ఈ ఉద్యమం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఆటంకం కాబోతున్నది కాబట్టి ప్రజల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేశారు. అధికారంతో ఉద్యమం నోరునొక్కే యాలనుకున్నారు. ఇదే నిన్నటి బలప్రయోగం యొక్క లక్ష్యం. కానీ తెలంగాణలో సామాజిక ఉద్యమం చాలా బలంగా ఉంది కాబట్టి దెబ్బలైనా తింటాం, కష్టాలైనా భరిస్తాం, కానీ మా గొంతులు మూగబోవని తేల్చి చెప్పారు ఉద్యమకారులు. ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఈ పోరాటం బలప్రయోగాలకు తలవంచదు. ఇదే విషయం హరగోపాల్ అరెస్టుతో తేలిపోయింది. ఈ ఉద్యమం రాబోయే ప్రజా ఉద్యమాలకు సంకేతం. నిన్నటి అఘాయిత్యం ప్రజల ఆశలను తుంచివేయడానికే. ప్రజాఉద్యమాల గొంతు నులిమి వేయడానికే తప్ప మరొకందుకు కాదు. అన్ని అభిప్రాయాలనూ స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామిక వ్యవస్థకు ఈ ఎన్నికలు అంకు రార్పణ చేయాలి. అధికారం ప్రజా సేవకోసం కానీ, అధి కారం ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో కారాదు. ప్రజలు బాగుపడాలంటే విద్యారంగంలో ప్రక్షాళన జరగాలి. ఎన్ని కలు అధికార సోపానానికి మార్గం కాకూడదు. అసమానత లను కూకటివేళ్ళతో పెకిలించగలిగే శక్తివంతమైన ఆయు ధంగా మారాలి. వ్యాసకర్త: చుక్కారామయ్య, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ. -
పుష్కరాల స్ఫూర్తితో ‘మేడారం’
వ్యవసాయూనికి 9 గంటల విద్యుత్ వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూటే సరఫరా గ్రామాల రూపురేఖలు మార్చేందుకే గ్రామజ్యోతి ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ 2 వేల పడకల ఆస్పత్రిగా ఎంజీఎం వచ్చే సంవ త్సరం నుంచి కేజీ టు పీజీ విద్య స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : పుష్కరాల స్ఫూర్తితో మేడారం జాతర నిర్వహిస్తామని, మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు, గ్రామ సీమల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్ వందనం స్వీకరించి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాం.. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలముందుంచారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి.. అందుకోసం రూ.600 కోట్లతో ఏర్పాట్లు చేసి అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఫిబ్రవరిలో మేడారం జాతర ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లాలో రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపట ప్రాంతాల్లో రూ.35 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఈసారి 25 లక్షల మంది భక్తులు పుణ్యస్నాలు చేసినట్లు తెలిపారు. 17న గ్రామజ్యోతి ప్రారంభం ఈనెల 17న గీసుకొండ మండలం గంగిదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి కడియం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని అన్నారు. 180 మంది అమరుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసిందన్నారు. ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 5,839 చెరువులకు గాను మొదటి దశలో రూ.409 కోట్లతో 1,173 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి కడియం తెలిపారు. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ఫేస్-2, వరద కాలువలు, కంతనపల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలోని ప్రతీ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చే స్తోందన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా రానున్న నాలుగేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం ఆసరా పింఛన్ పథకం ప్రారంభించి వికలాంగులకు నెలకు రూ.1500, మిగతా వారికి రూ.1000 ఇస్తూ ఆదుకుంటోందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నామని తెలిపారు. పగటిపూట విద్యుత్ రానున్న ఖరీఫ్‌లో రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు కావల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. అక్టోబర్ నాటికి జిల్లాలో కేటీపీపీ వద్ద మరో 600 మెగావాట్ల విద్యత్ అందుబాటులోలోకి వస్తుందన్నారు. జిల్లాలో రూ.50 కోట్లతో 17 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. 50 యూనిట్ల లోపు విద్యత్ వాడుకున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వమే కరంట్ చార్జీలు చెల్లిస్తోందని.. అందుకోసం రూ.19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. వాటర్ గ్రిడ్‌ను జిల్లాను 5 జోన్లుగా విభజించి రూ.4 వేల కోట్ల ప్రణాళికలతో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందని శ్రీహరి వివరించారు. నగర అభివృద్ధి వరంగల్ నగరంలో రానున్న 50 ఏళ్ల అవసరాలు గుర్తించి రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. 183 మురికివాడల అభివృద్ధికి రూ.26.45 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.80 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అదేవిదంగా కాళోజి కళాక్షేత్రం నిర్మాణానికి రూ. 15 కోట్లు, రూ.4 కోట్లతో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ ని ర్మించేందకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. నగరం లో 4 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్‌లలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 1000 పడకల ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం 2 వేల పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించుటకు పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 12 నూతన పీహెచ్సీ భవనాలు, రూ.1.80 కోట్లతో 20 సబ్‌సెంటర్ భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత మహిళా సాధికారతలో భాగంగా జిల్లాలోని 7,834 మహిళా గ్రూపులకు రూ.162.59 కోట్లతో బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 73 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.50.95 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఐసీడీఎస్ ద్వారా అమలవుతున్న ధనలక్ష్మి పథకం ద్వారా 8,170 మంది లబ్ధిదారులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. జిల్లాలో రహదారులు భవనాల శాఖ ద్వారా రూ.964.38 కోట్లతో 116 పనుల ద్వారా 877 కిలోమీటర్ల రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారి పేట నుంచి మల్లంపల్లికిరూ.158.85 కోట్లతో, పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రూ.49.68 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీ విద్యను అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కడియం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వాకాటి కరుణ, డీఐజీ మల్లారెడ్డి, సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, జేసీ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వంకర్నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అభివృద్ధికి పునరంకి తమవుదాం హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండలోని ఇన్డోర్ స్టేడియంలో సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఉత్సహబరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో కడియం పాటలు, ఆటలతో సందడి చేశారు. అంత్యాక్షరి, ఆటలు, ప్రసంగాలతో కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతనిధులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో డీఐజీ మల్లారెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అధికారులు, పురజాప్రతినిధులు పాల్గొన్నారు. -
'కేజీ టు పీజీ ఆంగ్లవిద్య అమలు ఏమైంది?'
నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకరాకపోవడం పట్ల ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి కార్యచరణ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న మోడల్ స్కూల్స్ భవనాలకు సంబంధించి నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారని అన్నారు. కేజీబీవీ స్కూ ల్స్‌లో ప్రహరీగోడలు నిర్మించినా.. వాటికి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు పాలకమండళ్లు నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినప్పుడు ప్రశ్నించానని చెప్పారు. మోడల్ స్కూల్స్ కు నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కడియం శ్రీహరికి లేఖ రాసినట్లు తెలిపారు. -
ఉస్మానియా భూముల జోలికి వెళ్లొద్దు
నల్గొండ: ఉస్మానియా యూనివర్సిటీ భూములను దళారులకు పంచెందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో జరిగిన నియోజకవర్గం బీజేవైఎం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన కేజీ టూ పీజీ విద్యా విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
కేజీ టు పీజీలోనూ వృత్తి విద్య!
- అనుసంధానించాలనే యోచనలో విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్యలో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టే అంశంపైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎన్ఎస్క్యూఎఫ్) రూపొందించిన కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు వివిధ దశల్లోని ఆయా కోర్సులను చదువుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న కేజీ టు పీజీలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. కేజీ టు పీజీపై విధాన పత్రం రూపొందించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యావేత్త చుక్కా రామయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, అదనపు డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివి ద అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా విధానంలో గురుకుల విద్య మాత్రమే పక్కాగా సత్ఫలితాలు ఇస్తోందన్న భావనకు ప్రభుత్వం వచ్చిం ది. అందుకే కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో గురుకుల విద్య, ఇంగ్లిషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని సమావేశంలో ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారు. అయితే ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి? ఏ తరగతి నుంచి గురుకుల విద్యను అమలు చేయాలన్న ఆంశాలపై వివిధ కోణాల్లో ఆలోచనలు చేశారు. కొంత మంది కిండర్‌గార్టెన్ (కేజీ) నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని పేర్కొనగా మరికొంత మంది 4వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని కొందరు పేర్కొనగా, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు కేజీ నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రాథమిక స్థాయిలో తెలుగుతోపాటు ఇంగ్లిషు మీడియంను కూడా కొనసాగించడానికి వీలు అవుతుందా? ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆంశాలపై చర్చించారు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఎక్కడా లేని కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయని, ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై చర్చ జరి గింది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై ఈనెల 18 లేదా 19 తేదీల్లో మరోసారి సమావేశమై విధాన పత్రాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆ విధానపత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించనున్నారు. సీఎం ఆమోదం తరువాత తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని, వెబ్సైట్లో పెట్టి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు.